బీఆర్ఎస్ సరూర్‌నగర్ సభకు డుమ్మా..! బీజేపీలోకి వెళ్లేందుకు మల్లారెడ్డి రెడీ?

by Kema Shiva Kumar |

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోంది.

బీఆర్ఎస్ సరూర్‌నగర్ సభకు డుమ్మా..! బీజేపీలోకి వెళ్లేందుకు మల్లారెడ్డి రెడీ?
X

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యవహారం బీఆర్ఎస్‌లో హాట్ టాపిక్​గా మారింది. ఇక ఆయన పార్టీకి దూరమైనట్టేనని కీలక నేతలు కేడర్​కు సంకేతాలు ఇచ్చారు. ఈ పరంపరంలో బీజేపీ గూటికి చేరుతున్నట్టు సంకేతాలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా మల్లారెడ్డితో పాటు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కొంతకాలం తాము పార్టీకి దూరంగా ఉంటామని, తమ విద్యాసంస్థలు, వ్యాపారసంస్థలు తమకు కీలకమని, ప్రభుత్వాలు తమ ఇబ్బందులకు గురిచేస్తున్నాయని చెప్పినట్టు తెలిసింది. కాగా, వారిని ఇక వదిలేయండి, వారికి సమాచారం ఇవ్వడం, వారిని పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడం, వారి నుంచి ఇతరత్రా విషయాలను ఆశించవద్దని ఇటీవల మేడ్చల్​జిల్లా నాయకుల సమావేశాల్లో పార్టీ కీలక నేత సూచించినట్టు తెలిసింది. అందులో భాగంగానే మల్లారెడ్డి, కుటుంబసభ్యులు పార్టీ సమావేశాలకు హాజరు కావడం లేదని తెలిసింది.

మల్లారెడ్డి దూరం.. దూరం

మల్లారెడ్డి కుటుంబం తొలుత కాంగ్రెస్ లేదా బీజేపీలోకి వెళ్లడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసినట్టు ప్రచారం జరిగింది. కాంగ్రెస్​మాత్రం వారిని దగ్గరికి రానివ్వలేదని, సీఎం రేవంత్​రెడ్డి వారి విషయంలో ఏ మాత్రం చాన్స్​ఇవ్వలేదని తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్​అధికారంలోకి రావడం, రేవంత్ రెడ్డి సీఎం కావడంతో మల్లారెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలు, విమర్శలతో ఇరకాటంలో పడ్డారు. అయితే బీజేపీ నేతలతో టచ్​లోకి వెళ్లడం, అక్కడ చర్చలు సక్సెస్​కావడంతో ఆటువైపు మొగ్గు చూపినట్టు సమాచారం. బీజేపీ జాతీయపార్టీ కావడంతో తమ విద్య, వ్యాపార కార్యకలాపాలను భారీగా విస్తరించుకోవచ్చని, వారి అండదండలు తమకు ఉంటాయని, తమపరంగా వారికి అన్నిరకాల సహాయ సహాకారాలు అందిస్తామని వారు అంచనా వేస్తున్నారు. బీజేపీతో డీల్​ఒకే కావడంతో బీఆర్ఎస్​కు క్రమక్రమంగా దూరమవుతూ వస్తున్నారని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇటీవల పార్టీ ముఖ్యకార్యక్రమాలకు మామతో పాటు అల్లుడు మర్రి రాజశేఖర్​రెడ్డి హాజరుకావడం లేదు. కాగా, శనివారం నాటి సరూర్​నగర్​సభతో పార్టీ కేడర్​కు స్పష్టత వచ్చింది. బీఆర్ఎస్​సభకు వెళ్లకపోగా, తన నియోజకవర్గ పరిధిలో జరిగిన అందెశ్రీ స్మృతివనం భూమిపూజకు మల్లారెడ్డి హాజరయ్యారు. అదే సమయంలో సీఎం రేవంత్​రెడ్డి.. మాజీసీఎం కేసీఆర్, ఇతర నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంటే అక్కడే సభా వేదికపై మల్లారెడ్డి ఉండటాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.

శ్రావణమాసం ముహూర్తం..

మల్లారెడ్డి కోడలు ఏకంగా బీజేపీ కార్యాయానికి వెళ్లొచ్చారు. తాము బీజేపీలోకి వెళ్లడం లేదని ఖండించారు. అయితే మల్లారెడ్డి, ఆయన కుటుంబం త్వరలోనే కమలతీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. ఆదివారం బీజేపీ ఇన్ చార్జ్ అభయ్​పాటిల్ చేసిన ప్రకటనతో వీరి చేరికకు మరింత ఊతమిచ్చినట్టయింది. శ్రావణమాసం నుంచి బీజేపీలో పెద్దఎత్తున చేరికలు ఉంటాయని అభయ్​పాటిల్ ప్రకటించారు. దీంతో మల్లారెడ్డి ఫ్యామిలీ చేరడం ఖాయమని పొలిటికల్ సర్కిల్ లో చర్చ నడుస్తున్నది. విద్యాసంస్థలు ఆక్రమించిన భూములు, నిబంధనలకు విరుద్ధంగా పొందిన అనుమతులు, కొత్తగా అదనపు సీట్లు తదితర వాటిపై తీవ్ర ప్రభావం పడిందని, మల్లారెడ్డితో పాటు మల్కాజ్​గిరి ఎమ్మెల్యే ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్​రెడ్డి ఆరోపణలు చేస్తూ వచ్చారు. తొలుత అల్లుడు మామతో తనకు సంబంధంలేదని, తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని చెప్పారు. ఆ తర్వాత ఆయనకు ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలో కుటుంబసభ్యులు కలిసి ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే వారు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైందని సమాచారం.

Next Story