50 కార్పొరేషన్లకు ముహూర్తం ఫిక్స్.. సీపీఐ, టీజేఎస్ ఆశలు నెరవేరేనా?

by Kema Shiva Kumar |

తెలంగాణలో కార్పొరేషన్ చైర్మన్ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ ముహూర్తం ఖరారు చేయడంతో మిత్రపక్షాలైన టీజేఎస్, సీపీఐ ఆశలు పెంచుకున్నాయి.

50 కార్పొరేషన్లకు ముహూర్తం ఫిక్స్.. సీపీఐ, టీజేఎస్ ఆశలు నెరవేరేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రస్తుతం 37 కార్పొరేషన్ల పదవులకు సంబంధించిన చైర్మన్ల కాలపరిమితి ఇటీవలే ముగిసింది. ఈ పదవుల భర్తీపైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలు సమీక్షలు, సమావేశాలను నిర్వహిస్తున్నారు. తాజాగా టీపీసీసీ చీఫ్​50 కార్పొరేషన్ల చైర్మన్లు, పలు డైరెక్టర్ పదవులను ఈ నెలాఖరులోగా భర్తీ చేస్తామని ప్రకటించారు. దీంతో అధికార పార్టీలోని ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు కాంగ్రెస్ మిత్రపక్షాలుగా వ్యవహరిస్తున్న తెలంగాణ జనసమతి, సీపీఐ పార్టీలు కూడా తమకూ నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పించాలని కోరుతున్నట్లుగా తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి సీపీఐ, టీజేఎస్ పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నాయి. కాంగ్రెస్‌తో కలిసి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశాయి. ఇందులో భాగంగానే మిత్రపక్షమైన సీపీఐకి కొత్తగూడెం ఎమ్మెల్యే సీటును కేటాయించగా అక్కడనుంచి పోటీ చేసిన కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మిత్రపక్షం కోటాలో సీపీఐకి చెందిన సీనియర్ నేత నెల్లికంటి సత్యంకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొత్తగూడెం కార్పొరేషన్‌లో హంగ్ ఏర్పడగా సీపీఐ, కాంగ్రెస్ కలిసి ఆ పీఠాన్ని కైవసం చేసుకున్నాయి. సీపీఐ మేయర్, కాంగ్రెస్‌ డిప్యూటీ మేయర్ పదవులను పంచుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం భర్తీ అవుతాయని భావిస్తున్న నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ తమకు అవకాశం ఇవ్వాలని సీపీఐ పట్టుబడుతున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు..

ఇక టీజేఎస్ కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి మిత్రపక్షంగా కొనసాగుతోంది. ఇటీవలే టీజేఎస్ చీఫ్ ప్రొ. కోదండరాం ఎమ్మెల్సీగా నియమితులయ్యారు. టీజేఎస్ మరో కీలకనేత ప్రొ. పీఎల్.విశ్వేశ్వరరావు తెలంగాణ విద్యా కమిషన్ మెంబర్‌గా కొనసాగుతున్నారు. రెండు నెలల్లో ఆయన పదవీకాలం కూడా ముగియనున్నదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, టీజేఎస్‌కి అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమకు రెండు ఎమ్మెల్సీలు, 5 కార్పొరేషన్ల చైర్మన్లు, 4 జెడ్పీ చైర్మన్లు ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇంకా ఒక ఎమ్మెల్సీ, నాలుగు కార్పొరేషన్ల చైర్మన్ల పదవులు ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీని విజ్ఞప్తి చేస్తున్నట్లుగా టీజేఎస్ వర్గాలు చెప్తున్నాయి. టీజేఎస్ సమావేశాల్లో కూడా నామినేటెడ్ పోస్టులపైన అధికార పార్టీని అడగాలన్న చర్చ జరుగుతోందని టీజేఎస్ నేతలు చెప్తున్నారు.

సానుకూలంగా స్పందించే చాన్స్..!

పదవుల భర్తీపై పీఎల్ విశ్వేశ్వరరావు ప్రస్తుత పోస్టును రెన్యువల్ చేయాలని, వీరితోపాటు ధర్మార్జున్, నిజ్జన రమేశ్ ముదిరాజ్, అంటి శ్రీనివాస్, భైరి రమేశ్, ఆశప్ప, సలీంపాషాల పేర్లు ఉన్నాయని టీజేఎస్ వర్గాలు తెలిపాయి. ప్రొ. కోదండరాం కూడా ప్రస్తుతం ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్నారు. ప్రభుత్వం నియమించిన తెలంగాణ ఉద్యమ గుర్తింపు కమీటీలో సభ్యులుగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా మిత్రపక్షాల నుంచి వస్తున్న డిమాండ్ల పట్ల సానుకూలంగానే ఉందని, పదవుల భర్తీపైన ఆయా పార్టీలకు పదవుల కేటాయింపుపైన తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని హస్తం వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ వచ్చే జెడ్పీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మిత్రపక్షాలకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇచ్చే చాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతోపాటుగా వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలు, ఇటు గ్రేటర్ హైదరాబాద్, మల్కాజ్‌గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ శక్తుల ఐక్యత కోసం మిత్రధర్మాన్ని కాంగ్రెస్ పాటిస్తుందన్న చర్చ అటు పార్టీలో ఇటు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

Next Story