- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెమోరీలాస్‌కు చెక్ పెట్టేందుకు కాగ్నిటివ్ ట్రైనింగ్
మెమోరీలాస్‌కు చెక్ పెట్టేందుకు ‘రిస్క్ రిడక్షన్ ఆఫ్ కాగ్నిటివ్ డిక్లైన్ అండ్ డిమెన్షియా’ పేరిట డబ్ల్యూహెచ్‌ఓ తన రెండో ఎడిషన్ సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారు. అందుకు స్ట్రెస్, వర్క్ ఓవర్ లోడ్, నిద్రలేని రాత్రులు కారణం కావొచ్చు. ఫలితంగా వయసు మీద పడుతున్న కొద్ది మెమోరీలాస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. డిమెన్షియా వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని వేధిస్తోంది. సుమారు 5.7 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతుండగా, ఇందులో 60 శాతానికి పైగా భారత్ వంటి మధ్య, అల్ప ఆదాయ దేశాల్లోనే ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి నిర్దిష్టమైన మందులు లేదా శాశ్వత చికిత్స లేనందున, నివారణ ఒక్కటే ఏకైక మార్గమని స్పష్టం చేస్తూ.. ‘రిస్క్ రిడక్షన్ ఆఫ్ కాగ్నిటివ్ డిక్లైన్ అండ్ డిమెన్షియా’ పేరిట డబ్ల్యూహెచ్‌ఓ తన రెండో ఎడిషన్ సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. మానసిక, శారీరక సామర్థ్యాన్ని దెబ్బతీసే ఈ వ్యాధి బారిన పడకుండా ఉండటానికి రోజువారీ జీవితంలో మార్చుకోగలిగే కీలక అంశాలను (మొడిఫయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్)ను ఈ నివేదికలో పొందుపరిచారు.
ముందు జాగ్రత్తే శ్రీరామరక్ష..
ప్రపంచవ్యాప్తంగా మతిమరుపు జబ్బు (డిమెన్షియా) బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ ఆందోళనకరంగా పెరుగుతుంది. ముఖ్యంగా వయసు పైబడిన తర్వాత చాలా మందిని వేధించే ప్రధాన సమస్యగా మారింది. ప్రస్తుతం ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసే ఖచ్చితమైన చికిత్స లేదా మందులు అందుబాటులో లేవు. దీంతో వ్యాధి రాకుండా ముందుగా జాగ్రత్త పడడమే ఏకైక మార్గమని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. జీవిత కాలంలో మనం మార్చుకోగలిగే కొన్ని అలవాట్లు, ఆరోగ్య పరిస్థితులను సకాలంలో సరిదిద్దుకోవడం ద్వారా దాదాపు 45 శాతం వరకు మతిమరుపు ముప్పును తగ్గించవచ్చని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. ఇందుకు ప్రత్యేకంగా రూపొందించిన ముఖ్యమైన పలు నివారణ మార్గాలను సూచించింది. అలవాట్లు మారిస్తే నిర్ణీత కాలంలో మెదడు పూర్వ స్థితికి వస్తుందని స్పష్టం చేసింది. డబ్ల్యూహెచ్‌ఓ తాజా నివేదిక ప్రకారం, మనం మార్చుకునే జీవనశైలి ఆధారంగా మెదడు కణాల పునరుద్ధరణ జరుగుతుందని పేర్కొంది.
ఎంత టైం కావాలంటే..
*మద్యం అలవాటు మానేస్తే (6-12 నెలలు) : అతిగా మద్యం సేవించే అలవాటు ఉన్నవారు పూర్తిగా దానికి దూరంగా ఉంటే, సాధారణంగా 6 నుండి 12 నెలల వ్యవధిలో మెదడు తన జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఆలోచనా సామర్థ్యం (ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్) వంటి విధులను మళ్లీ పుంజుకుంటుంది.
*ధూమపానం వీడితే (9 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ) : పొగతాగే అలవాటు ఉన్నవారు దానిని ఎప్పుడు మానేశారనే సమయం చాలా కీలకం. పొగతాగడం మానేసి 9 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం దాటిన వారిలో డిమెన్షియా వచ్చే ముప్పు, అస్సలు పొగతాగని వారితో సమానంగా (నార్మల్ స్థితికి) తగ్గుతుందని పెద్ద కోహోర్ట్ అధ్యయనాలు వెల్లడించాయి. ఇటీవలి కాలంలో (9 ఏళ్లలోపు) మానేసిన వారిలో మాత్రం ఈ ముప్పు ఇంకా ఎక్కువగా ఉంటుందని నివేదిక పేర్కొంది.
*ఆహార నియమాలు (13-37 నెలలు) : మెడిటరేనియన్, డాష్ లేదా మైండ్ వంటి సమతుల్య ఆహార పద్ధతులను నిరంతరాయంగా 13 నుండి 37 నెలల పాటు పాటిస్తే, గ్లోబల్ కాగ్నిషన్, మెదడు సమాచారాన్ని ప్రాసెస్ చేసే వేగం గణనీయంగా మెరుగుపడి పూర్వ స్థితికి వస్తుంది.
ఏవి అదుపు చేస్తే ముప్పు తగ్గుతుంది?
*మిడ్‌లైఫ్ ఊబకాయం : నడి వయసులో బరువు తగ్గడానికి క్యాలరీల నియంత్రణ, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల కేవలం 6 నుండి 17 నెలల కాలంలోనే జ్ఞాపకశక్తి, కాగ్నిషన్ మెరుగుపడినట్టు ఆధారాలు ఉన్నాయి.
*గాలి కాలుష్యం : వాతావరణంలో కంటికి కనిపించని ప్రమాదకర సూక్ష్మ ధూళి కణాలు(పీఎం2.5) బ్లడ్-బ్రెయిన్ బారియర్‌ను దాటి మెదడులోకి ప్రవేశిస్తాయి. ఇవి మెదడు నరాల వాపునకు కారణమవుతాయి. గాలి కాలుష్యం లేని పర్యావరణంలో ఉండటం వల్ల డిమెన్షియా ముప్పును నేరుగా తగ్గించవచ్చని డబ్ల్యూహెచ్‌ఓ తొలిసారిగా ఈ గైడ్‌లైన్స్‌లో చేర్చింది.
*వినికిడి లోపం : ప్రపంచవ్యాప్తంగా వయసు పైబడటం వల్ల వచ్చే వినికిడి లోపాన్ని సరి చేయకపోతే అది సామాజిక దూరం, మెదడుపై అదనపు ఒత్తిడికి కారణమై డిమెన్షియా ముప్పును 7 శాతం పెంచుతుంది. అందుకే వినికిడి లోపం ఉన్న వృద్ధులకు వెంటనే శ్రవణ పరికరాలు (హియరింగ్ ఎయిడ్స్) అమర్చడం ద్వారా జ్ఞాపకశక్తి క్షీణించకుండా కాపాడవచ్చు.
*విటమిన్ సప్లిమెంట్లపై డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టత : చాలామంది మతిమరుపు రాకుండా ఉండేందుకు విటమిన్ టాబ్లెట్లు వాడుతుంటారు. శరీరంలో నిర్ధారిత విటమిన్ లోపాలు లేనంత వరకు... జ్ఞాపకశక్తి పెరగడానికంటూ విడిగా విటమిన్ బి, విటమిన్ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లేదా మల్టీ విటమిన్ సప్లిమెంట్లను వాడటం అసలు శ్రేయస్కరం కాదని, వీటిని తీసుకోరాదని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టంగా నివారించింది.
*డిమెన్షియా ముప్పులో 45 శాతం మన చేతుల్లోనే ఉందనే విషయాన్ని ఈ నివేదిక నిరూపించిందని డబ్ల్యూహెచ్ఓ నాన్‌కమ్యూనికబుల్ డిసీజెస్ అండ్ మెంటల్ హెల్త్ విభాగం డైరెక్టర్ దేవోరా కెస్టెల్ తెలిపారు. సమతుల్య ఆహారం, నిరంతర శారీరక, మానసిక శ్రమ ద్వారా భవిష్యత్ తరాలను ఈ మహమ్మారి నుంచి కాపాడుకోవచ్చని పిలుపునిచ్చారు.
ఏమిటీ ‘కాగ్నిటివ్ ట్రైనింగ్’
డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాల ప్రకారం.. మెదడులోని నిర్దిష్ట భాగాలను ఉత్తేజ పరిచేందుకు నిపుణుల పర్యవేక్షణలో ఒక క్రమపద్ధతిలో ఇచ్చే మానసిక వ్యాయామాలనే కాగ్నిటివ్ ట్రైనింగ్ అంటారు. శరీర దృఢత్వం కోసం వ్యాయామాలు చేసినట్లే, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఆలోచనా సామర్థ్యం పెంచడానికి చేసే నిరంతర సాధన ఇది. ప్రత్యేకంగా రూపొందించిన డిజిటల్ సాఫ్ట్‌వేర్ లేదా టాస్క్‌ల ద్వారా మెదడు నరాలను పదే పదే ఉద్దీపన చేస్తారు. నిత్యం మనం సరదాగా ఆడే ఆటలు, చదివే పుస్తకాలు కాగ్నిటివ్ స్టిమ్యులేషన్ (సాధారణ మానసిక ఉల్లాసం) కిందికి వస్తే.. మెదడులోని లోపాలను సరిదిద్దేందుకు ఒక నిర్దిష్ట లక్ష్యంతో ఇచ్చే పునరావృత శిక్షణను ‘కాగ్నిటివ్ ట్రైనింగ్’ అంటారు. వయసు పైబడిన వారిలోనూ, స్వల్పంగా మతిమరుపు లక్షణాలు (ఎంసీఐ) ఉన్న వారిలోనూ ఈ శిక్షణ అద్భుత ఫలితాలను ఇస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టంచేసింది.






