- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్నినో ఎఫెక్ట్.. ఉమ్మడి 10 జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం
తెలంగాణలో ఎల్ నినో వాతావరణ పరిస్థితులపై పర్యవేక్షణకు 10 ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా సీనియర్ ఐఏఎస్‌లను ప్రభుత్వం నియమించింది.

దిశ,తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ఎల్ నినో ఎఫెక్ట్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షపాతం, భూగర్భ జలాలు, సాగునీరు, తాగునీటి ఎద్దడి వంటి అత్యవసర పరిస్థితులను పర్యవేక్షించేందుకు 10 ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా (Special Officers) సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషల్ ఆఫీసర్లు తమకు కేటాయించిన జిల్లాల్లో వర్షపాతం, జలాశయాల్లో నీటి మట్టాలు, భూగర్భ జలాల స్థాయిలు, తాగునీటి లభ్యత, వ్యవసాయ, ఉద్యాన పంటల పరిస్థితి, విద్యుత్ సరఫరా తదితర అంశాలను నిరంతరం పరిశీలించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల మధ్య సమన్వయం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన జిల్లాలను జూలై 20న సందర్శించాలని, ఆయా జిల్లాలకు ఇన్‌చార్జులుగా ఉన్న మంత్రులతో కలిసి జిల్లా స్థాయి సమీక్ష సమావేశాల్లో పాల్గొని, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో సమావేశాలు నిర్వహించేందుకు సహకరించాలని సూచించింది. ఈ సమావేశాలు ప్రభుత్వం నిర్దేశించిన అజెండా ప్రకారం నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది.
జిల్లాల వారీగా నియమితులైన ప్రత్యేక అధికారులు:
హైదరాబాద్: జయేష్ రంజన్
రంగారెడ్డి: వికాస్ రాజ్
కరీంనగర్: బెన్హర్ మహేష్ దత్ ఎక్కా
మెదక్: ఎ.వాణి ప్రసాద్
నిజామాబాద్: డాక్టర్ యోగితా రాణా
నల్గొండ: హరిచందన దాసరి
ఆదిలాబాద్: కె.ఇలంబరితి
వరంగల్: ఎ.శ్రీదేవసేన
మహబూబ్‌నగర్: వి.పి. గౌతమ్
ఖమ్మం: అనుదీప్ దురిశెట్టి
జిల్లా నివేదికల అనంతరం సీఎం సమీక్ష:
గత శుక్రవారం జరిగిన భేటీలో ఎల్‍నినో పరిస్థితులపై కేబినెట్ చర్చించింది. తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎన్‍నినో ప్రభావంపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అధ్యక్షతన వ్యవసాయ నిపుణులు, శాత్రవేత్తలతో వ్యవసాయ రంగంపై ఎల్ నినో ప్రభావంపై ప్రత్యేక నివేదిక రూపొందించాలని కేబినెట్ సూచించింది. అలాగే అన్ని జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితులు, వెంటనే చేపట్టాల్సిన చర్యలు తెలుసుకునేందుకు అత్యవసర సమీక్ష సమావేశాలు నిర్వహించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. రేపు (జులై 20న) ఉమ్మడి జిల్లాల వారీగా జిల్లా మంత్రులు ఆధ్వర్యంలో ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది. ఇన్ చార్జి మంత్రితో పాటు ఒక్కో సీనియర్ ఐఏఎస్ అధికారికి ఈ బాధ్యతలు అప్పగించాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు తాజాగా ప్రభుత్వం ఉమ్మడి జిల్లాల వారీగా ఏఐఎస్ అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించింది.






