Phone Tapping Case: బీఆర్ఎస్‍కు షాక్.. మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు సిట్ నోటీసులు

by Prasad Jukanti |   (  Updated:2026-01-07 11:04:23  IST  )

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

Phone Tapping Case: బీఆర్ఎస్‍కు షాక్.. మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు సిట్ నోటీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) విచారణలో దూకుడు ప్రదర్శిస్తున్న సిట్ (SIT) మరో ట్విస్ట్ ఇచ్చింది. ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మె్ల్సీ నవీన్ రావు తండ్రి కొండల్ రావుకు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్ రావుకు సిట్ నోటీసులు జారీచేసిన గంటల వ్యవధిలోనే మరో ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు సిట్ నోటీసులు ఇచ్చింది. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలకు నోటీసులు ఇచ్చింది. రేపు ఉదయం 11 గంటలకు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. నవీన్ రావు తండ్రి కొండల్ రావుకు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్ రావును ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు పిలిచిన సిట్ ఆ ఆ వెంటనే బీఆర్ఎస్‍కు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు వెళ్లడం సంచలనంగా మారింది.

రేపు విచారణకు రండి:

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో తాజాగా సిటీ సీపీ సజ్జనార్ నేతృత్వంలో కొత్త సిట్ ఏర్పాటు చేయగా ఈ దర్యాప్తు బృందం దూకుడుగా వెళ్తోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారించిన సిట్ ఇప్పుడు రాజకీయనాయకులపై ఫోకస్ పెట్టింది. ఈక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావును గత ఆదివారం సుదీర్ఘంగా 8 గంటలకు పైగా ప్రశ్నించిన అధికారులు ఆయన నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. ఆయన ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా దర్యాప్తును ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్ (Jaipal Yadav), చిరుమర్తి లింగయ్య (Chiramarthi Lingaiah) ను ప్రశ్నించబోతుండటం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. నిజానికి ఈ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు గతేడాది సిట్ ప్రశ్నించింది. ఈ కేసులో ఎస్ఐబీ మాజీ అడిషనల్ ఎస్పీ మేకల తిరుపతన్న ఫోన్ లో జైపాల్ యాదవ్ కు సంబంధించిన లింక్ దొరికిందన్న ఆధారాలతో గతంలో సిట్ జైపాల్ యాదవ్ ను విచారించింది. ఇక తన ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేసి నిఘా ఉంచారన్న ఆరోపణలతో గతంలోనే చిరుమర్తికి పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించారు. అయితే గతంలో విచారణ ఎదుర్కొన్న జైపాల్ యాదవ్, చిరుమర్తిని మరోసారి సిట్ నోటీసులు ఇవ్వడంతో త్వరలో ఈ కేసులో పొలిటికల్ బాంబులు పేలనున్నాయా అనే చర్చ నడుస్తోంది.

READ MORE ....

ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ బ్లాస్ట్.. సీఎం సోదరుడు కొండల్‌ రెడ్డికి సిట్ నోటీసులు

Next Story