మంచు గుప్పిట్లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్.. పలు విమానాల రద్దు, ప్రయాణికుల పడిగాపులు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-02 04:34:37  IST  )

రాష్ట్రంలో చలి తీవ్రత పెరగడంతో పాటు దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

మంచు గుప్పిట్లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్.. పలు విమానాల రద్దు, ప్రయాణికుల పడిగాపులు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో చలి తీవ్రత పెరగడంతో పాటు దట్టమైన పొగమంచు (Dense Fog) కమ్ముకోవడంతో హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (RGIA) విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇవాళ తెల్లవారుజాము నుంచి రన్‌వేపై విజిబిలిటీ ఏకంగా జీరోకి పడిపోవడంతో పలు విమానలు రద్దు కాగా భారీ సంఖ్యలో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలోనే శంషాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన ఇండిగో విమానం గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తోంది. అదేవిధంగా తిరుపతి నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానం కూడా ఇంకా ఎయిర్‌పోర్టుకు చేరుకోలేదు.

ఎయిరిండియా సర్వీసులు రద్దు

మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో నెలకొన్న ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీ నుంచి శంషాబాద్‌కు రావాల్సిన, అలాగే ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిరిండియా (Air India) సర్వీసులను రద్దు చేశారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 140కి పైగా విమానాలు రద్దు కావడంతో ఆ ప్రభావం హైదరాబాద్‌ (Hyderabad)పై పడింది. ఇక కేవలం విమానాలే కాకుండా, ఎయిర్‌పోర్ట్ వైపు వెళ్లే బెంగళూరు జాతీయ రహదారి (NH-44)‌పై పొగమంచు కారణంగా 10 కి.మీ మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

ప్రయాణికుల పడిగాపులు..

విమానాలు రద్దు కావడంతో విమానాశ్రయంలోని డిపార్చర్ హాల్ ప్రయాణికులతో నిండిపోయింది. ముఖ్యంగా కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్న ప్రయాణికులు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విమానయాన సంస్థల కౌంటర్ల వద్ద తమకు సరైన సమాచారం ఇవ్వడం లేదని కొందరు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Read More..

శంషాబాద్-బెంగళూరు హైవే‌పై భారీగా పొగమంచు.. 10 కి.మీ మేర స్తంభించిన ట్రాఫిక్

Next Story