ఆ గంట ఆగకుంటే ప్రాణాలు దక్కేవేమో! మార్కాపురం బస్సు ప్రమాదంలో విస్తుపోయే విషయాలు

by Prasad Jukanti |   (  Updated:2026-03-26 07:09:42  IST  )

మార్కాపురం బస్సు ప్రమాదంలో 13 మంది సజీవదహనం వెనుక ట్రైవెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆ గంట ఆగకుంటే ప్రాణాలు దక్కేవేమో! మార్కాపురం బస్సు ప్రమాదంలో విస్తుపోయే విషయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వరుస రోడ్డు ప్రమాదాలు తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్నాయి. ఇవాళ తెల్లవారుజామున ఏపీలోని మార్కాపురం జిల్లాలో (Markapuram Bus Accident) హరికృష్ట ట్రావెల్స్ కు (Harikrishna Travels) చెందిన బస్సు, టిప్పర్ ఢి కొట్టిన ఘటనలో 13 మంది సజీవ దహనం కాగా మరో 28 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషయమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం జరిగిన తీరు, ఘటన స్థలంలోని దృశ్యాలు భీతిగొల్పేలా ఉన్నాయి. ప్రమాదానికి గురైన బస్సు కండీషన్ విషయంలో ఇప్పుడు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. బస్సు కండిషన్ బాగోలేదని మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు కీలక విషయాలు వెల్లడించారు. ప్రమాదం జరిగే సమయానికి గంట ముందు కూడా బస్సు ట్రబుల్ ఇచ్చిందని దాంతో గంట సేపు బస్సును నిలిపివేసి రిపేర్లు చేశారని ఆ తర్వాత ప్రయాణం మొదలైన కొద్దిసేపటికే ఈ ఘోరం జరిగినట్లు తెలిపారు. ఒక వేళ ఈ గంట సమయం ప్రయాణం కూడా సాఫీగా జరిగితే ఈ గండం నుంచి తమ వారు బయటపడేవారేమోనని బాధిత కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు.

సంక్రాంతి సమయంలోనే జరిమానా:

ప్రమాదానికి గురైన హరికృష్ణ ట్రావెల్స్ బస్సు కండిషన్ బాగోలేదని రెండు నెలల క్రితం జరిగిన సంక్రాంతి పండగ సమయంలోనే బయటపడినట్లు తెలుస్తోంది. ఆర్టీఏ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో బస్సు కండీషన్ బాగోలేదని రూ.36 వేల జరిమానా విధించారని అధికారులు వెల్లడించారు. ఈ జరిమానాతోనైనా బస్సు కండీషన్ మెరుగు పరిచి ప్రయాణికుల భద్రతపై దృష్టి సారించి ఉంటే ఇవాళ ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదేమో అని బాధితులు చెబుతున్నారు. కానీ కాసుల కక్కుర్తికి ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టి యాజమాన్యం కండీషన్ సరిగా లేకపోయినా, డ్రైవర్ల పట్ల సరైన నిఘా లేకుండా సర్వీసులు నడుపుతుండటంతో ఇవాళ 13 మంది నిండు ప్రాణాలు బూడిదపాలయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కావేరీ ఘటన మరువక ముందే:

తెలుగు రాష్ట్రాల్లో ఒక విషాదం నుంచి తేరుకోక ముందే మరో ఘోరం వెంటాడుతోంది. తాజాగా జరిగిన మార్కాపురం ఘటనకు ముందు గతేడాది అక్టోబర్‍ కర్నూల్ జిల్లాలో వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురై 20 మంది మాంసపు ముద్దలుగా మిగిలారు. ఈ ఘటనలోనూ కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యం నిండుగా కనిపించింది. సీటింగ్‌కు పర్మిషన్ తీసుకుని అక్రమంగా స్లీపర్‌గా మార్చి సర్వీసులు నడపడంతో ప్రమాదానికి గురైన సమయంలో బయటపడేందుకు వీలు లేక ప్రాణనష్టం పెరిగింది. ఇప్పుడు మార్కాపురం ఘటనలో బస్ ఫిట్‍నెస్ సరిగా లేకపోయీనా సర్వీసులు నడుపుతుండటం రాష్ట్రంలోని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాల నిర్లక్ష్యంపై మరోసారి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడే అధికారులు హడావుడి చేయకుండా నిత్యం తనిఖీలు చేసీ సురక్షిత ప్రయాణానికి భరోసా కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Markapuram Bus Accident : గుండెలు పగిలే దృశ్యాలు.. మాంసపు ముద్దలుగా మార్కాపురం మృతులు

Next Story