సారుకు ఫికర్! పార్టీ పరిస్థితులపై గులాబీ బాస్‌కు టెన్షన్

by Disha Web Desk 4 |
సారుకు ఫికర్! పార్టీ పరిస్థితులపై గులాబీ బాస్‌కు టెన్షన్
X

రాష్ట్రంలో ఎన్నికల హీట్ మొదలైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రాజకీయపార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ సమయంలో గులాబీబాస్‌కు గుబులు పట్టుకున్నది. రాష్ట్రంలో ఏయే సెగ్మెంట్లలో బీఆర్ఎస్ ఎంత మేరకు బలంగా ఉంది? కర్ణాటక ఎన్నికల ఫలితాలు తర్వాత కాంగ్రెస్ ఎంత వరకు పుంజుకుంది? బీజేపీ బలం తగ్గిందా? ఏయే సెగ్మెంట్లపై ఆయా పార్టీల ప్రభావం ఉంటుంది? అనే విషయాలపై కేసీఆర్ ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది. మరో వైపు బీఆర్ఎస్‌లో సిట్టింగులకు, ఆశావహులకు టికెట్ రాకుంటే వారిలో చాలా మంది పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు టాక్. ఆ ఎఫెక్ట్ గులాబీ పార్టీపై ఏ మేరకు ఉంటుందన్న విషయంపైనా కేసీఆర్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. కేసీఆర్ సైతం ఓటర్లను ఆకర్షించేపనిలో నిమగ్నమయ్యారు. కానీ ఆయన మదిలో గుబులు మొదలైంది. క్షేత్రస్థాయిలో ఇతర పార్టీల బలమెంత? బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది? అనే విషయాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.

ఏ గ్రామంలో ఏయే పార్టీ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు పలు సర్వేల సంస్థలకు చాలా కాలం క్రితమే బాధ్యతలు అప్పగించారు. కర్ణాటక ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లోనూ పలు మార్పులు చోటుచేసుకుంటుండటంతో కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు పుంజుకుంది? బీజేపీ ఎక్కడ బలహీనపడింది? అనే విషయాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టు సమాచారం.

కాంగ్రెస్ బలం పుంజుకుందా?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ యాక్టివిటీస్ పెరిగాయి. దీంతో ఆ పార్టీ క్షేత్ర స్థాయిలో దూకుడు పెంచింది. అయితే కాంగ్రెస్‌కు నిజంగా ప్రజల్లో బలం పెరిగిందా? దాంతో బీఆర్ఎస్‌కు ఏ మేరకు నష్టం? ఆ నష్టం ఏయే అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉంది? అనే వివరాలను సేకరిస్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ నెమ్మదిగా పుంజుకుంటున్నట్టు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

బీజేపీ బలహీనతలపైనా ఫోకస్

ఉత్తర తెలంగాణ జిల్లాలైన అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీ బలంగా ఉన్నది. ఇప్పటివరకు జరిపిన పలు సర్వేల్లో ఆ మూడు జిల్లాల్లో మెజార్టీ అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరు ఉంటుందని రిపోర్టులు వచ్చినట్టు సమాచారం. కర్ణాటక రిజల్ట్ తర్వాత ఆ మూడు జిల్లాల్లో బీజేపీ ఏమేరకు స్ట్రాంగ్‌గా ఉంది? ఏమైన బలహీన పడిందా? కాంగ్రెస్ శ్రేణుల్లో యాక్టివిటీస్ ఏలా ఉన్నాయి? అనే వివరాలను ఆరా తీస్తున్నారు.

వలసల ఎఫెక్ట్‌పై ఆరా

బీఆర్ఎస్‌లో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ కట్ చేసేందుకు గులాబీ నిర్ణయం తీసుకున్నట్టు టాక్. వీరితో పాటు కొందరు లీడర్లు టికెట్లపై ఆశలు పెట్టుకున్నారు. ఒక వేళ సిట్టింగులకు గానీ ఆశావహులకు గానీ టికెట్లు దక్కకపోతే వారు కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇలాంటి వారు బీఆర్ఎస్ ను వీడితే స్థానికంగా పార్టీ పరిస్థితులు ఎటా ఉంటాయి? పార్టీ అభ్యర్థి గెలుపొటములపై ఎంత మేరకు ప్రభావం ఉంటుంది? అనే అంశాలపైనా గులాబీ బాస్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది.

Also Read..

ఎన్నికల ముందు కాషాయ పార్టీలో భారీ కుదుపు

Next Story

Most Viewed