రైల్వే బ్రిడ్జితో కష్టాలు.. ప్రమాదపు అంచున ప్రయాణం

by Ratna Kumari |

చినుకు పడితే చాలు మండల పరిధిలోని నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

రైల్వే బ్రిడ్జితో కష్టాలు.. ప్రమాదపు అంచున ప్రయాణం
X

దిశ, కమ్మర్ పల్లి: చినుకు పడితే చాలు మండల పరిధిలోని నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మండల కేంద్రం నుండి ఉప్లూర్ గ్రామానికి వెళ్లే దారిలో గల రైల్వే బ్రిడ్జి కింద చాలా రోజుల నుంచి నీరు నిల్వ ఉండటంతో అటువైపు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వచ్చిన ప్రతిసారి నీరు బ్రిడ్జి కిందకు చేరడంతో దాదాపు అడుగుల లోతు నిల్వ ఉందని, దీంతో ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. బ్రిడ్జ్ ప్రాంగణంలో నిత్యం మోకాళ్ళ లోతు నీళ్లు నిలిచి ఉండటంతో ప్రజలు ప్రమాదపు అంచున ప్రయాణం చేస్తున్నారు. పిల్లా పాపలతో ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న వారికి అవస్థలు తప్పడం లేదు. మండల కేంద్రానికి నిత్యం వివిధ గ్రామాల నుండి అనేకమంది ప్రయాణికులు, బాటసారులు వివిధ పనుల కోసం వచ్చి వెళుతుంటారు.

వివిధ రకాల వాహనాలు ఈ అండర్ బ్రిడ్జి కింది నుండి వెళ్తుంటాయి. చినుకు పడితే చాలు వివిధ కాలువల ద్వారా, ఇండ్ల ద్వారా ఈ అండర్ బ్రిడ్జిలోకి నీరు చేరి దుర్గంధాన్ని వెదజల్లుతూ అద్వాన్నంగా తయారైంది. ఈ బ్రిడ్జ్ నిర్మించిన నాటి నుండి నేటి వరకు మురికి నీటిలోనే బాటసారులు ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి. నిత్యం నీళ్ల తాకిడి ఉండటంతో ఈ అండర్ బ్రిడ్జి రోడ్డంతా గుంతలుగా ఏర్పడింది. దీనిగుండా ప్రయాణం చేసిన వాహనాలు, ప్రయాణికులు ప్రమాద బారిన పడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కనీసం వీధి దీపాలు కూడా లేకపోవడంతో రాత్రి వేళల్లో అయితే ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రజా ప్రతినిధులు, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరును చూసి స్థానికులు మండిపడుతున్నారు. సంబంధిత రైల్వే అధికారులకు శాశ్వత చర్యలు చేపట్టాలని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని మండలంలోని ప్రజలు కోరుతున్నారు.

Next Story