- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతీయ రహదారుల పై ప్రమాదాల నియంత్రణే లక్ష్యం : కలెక్టర్ ప్రతిమా సింగ్
జాతీయ రహదారుల పై రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యమని స్పెషల్ సీఎస్, రవాణా, రోడ్లు-భవనాల శాఖ వికాస్ రాజ్ స్పష్టం చేశారు.

దిశ, మెదక్ ప్రతినిధి : జాతీయ రహదారుల పై రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యమని స్పెషల్ సీఎస్, రవాణా, రోడ్లు-భవనాల శాఖ వికాస్ రాజ్ స్పష్టం చేశారు. జాతీయ రహదారుల పై రోడ్డు భద్రతా చర్యల పై స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, పోలీసు శాఖ, జాతీయ రహదారుల శాఖ అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ హాజరయ్యారు. స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ రహదారుల వెంట భారీ వాహనాలు, ట్రక్కులు పార్కింగ్ చేయవద్దని సూచించారు. నిర్దేశిత ప్రాంతాలు మినహా ఎక్కడా వాహనాలు పార్కింగ్ చేయవద్దని స్పష్టం చేశారు.
అలాగే రోడ్డు పై ఆక్రమణలు ఉండకుండా చూడాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు, అధికారులు, పోలీసులు, జాతీయ రహదారుల అధికారులతో టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే జాతీయ రహదారుల వెంట పోలీసు, రవాణా శాఖ అధికారుల పెట్రోలింగ్ వాహనాలు నిరంతరం పెట్రోలింగ్ చేసేలా చూడాలని సూచించారు. ఆ వాహనాల్లో అత్యవసర సేవలు అందించే సామగ్రి అందుబాటులో ఉండాలని తెలిపారు. వైద్యారోగ్య శాఖ అధికారులు తమ జిల్లా పరిధిలోని అన్ని ఆసుపత్రుల వివరాలు, ట్రామా కేర్ సెంటర్ల వివరాలను మ్యాపింగ్ చేసి, అత్యవసర సమయంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని జిల్లాల్లో బ్లాక్ స్పాట్లను గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రభుత్వ ఆదేశాలు పక్కాగా అమలు..
రోడ్డు భద్రత కింద జారీ చేసిన ఆదేశాలను జిల్లాలో పక్కాగా అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ జాతీయ రహదారుల వెంట గుర్తించిన బ్లాక్ స్పాట్ల సమస్యల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన పనులపై ఆరా తీసి, భవిష్యత్తు ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్ అండ్ బి ఈఈ శంకర్, అరుణ్, జాతీయ రహదారుల అధికారులు దివ్య, వేణు, వినోద్, రవాణా అధికారి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.






