ఇప్పుడే వస్తామని వెళ్లి తిరిగి రాలేదు.. ఆర్టీసీ జేఏసీ నేతలపై పొన్నం సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2026-04-22 08:37:11  IST  )

ఆర్టీసీ సమ్మెపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది బీఆర్ఎస్ కుట్ర అని ఆరోపించారు.

ఇప్పుడే వస్తామని వెళ్లి తిరిగి రాలేదు.. ఆర్టీసీ జేఏసీ నేతలపై పొన్నం సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న వేళ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి నలుగురు ఐఏఎస్‌ అధికారుల కమిటీతోని ఏర్పాటు చేసి జేఏసీ నేతలను చర్చలకు ఆహ్వనించామన్నారు. సమావేశంలో నాలుగు గంటలపాటు విన్న నేతలు ఇప్పుడే వస్తామని మీటింగ్ నుంచి బయటకు వెళ్ల తిరిగి రాకపోగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే సమ్మెకు పిలుపు ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్‍లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నామనడం పొరపాటు అని కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 వెంటనే పరిష్కారం చేయదగినవేనని వీటిపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలనే అంశం పెండింగ్‍లో ఉందని స్పష్టం చేశారు.

విధుల్లో చేరండి:

ఆర్టీసీ జేఏసీ నేతలు నిరసన తెలపవచ్చు.. మిగతా వారు విధుల్లో చేరాలని పొన్నం ప్రభాకర్ అన్నారు. పేదల ప్రయాణాలకు ఆర్టీసీ కార్మికులు ఇబ్బందులు కలగజేయవద్దని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా డిమాండ్లు పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. ఆర్టీసీ పరిరక్షణ, ప్రజా శ్రేయస్సు కోసం కార్మికులు సమ్మె విరమించాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. సమస్యకు సమ్మె పరిష్కారం కాదన్నారు. కార్మికుల సమస్య పరిష్కారానికి కమిటీ వేసి నాలుగు వారాల్లోపు నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించామన్నారు. ఉద్యోగం చేసే వారు తమ నిజమైన సమస్యలను చెప్పి పరిష్కారం కోరితే అయిపోయేది. కానీ జేఏసీ పేరుతో చేస్తున్నారు. కార్మిక సంఘాల అంశం కార్మిక చట్టంలో ఉండవచ్చు. కార్మిక నాయకత్వ చట్టాలు ఏమున్నాయో తెలియదు. చర్చలకు ఆహ్వానిస్తున్నామని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కానీ సంఘాల పేరు మీద మేం ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటే ప్రభుత్వం ఎప్పుడు ప్రభుత్వమే అన్నారు.

బీఆర్ఎస్ కుట్ర:

ఆర్టీసీ సమ్మె బీఆర్ఎస్ నాయకుల కుట్ర అని ఆరోపించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు హరీశ్ రావు ఈ కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా రాక్షసానందం పొందేందుకు ఎంతటికైనా దిగజారుతామనుకుంటే అది వారి ఖర్మ అన్నారు. ఇటీవల జగిత్యాల సభలో మహా లక్ష్మీ ప్రయాణం కేసీఆర్ అవహేళన గా మాట్లాడారు. వెంటనే ఆర్టీసీపై కుట్రలో భాగంగానే గతంలో యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా ఉన్న హరీశ్ రావు సమ్మె పై కార్మికులను ప్రోత్సహించారు. మహా లక్ష్మీ పథకాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సకల జనుల సమ్మె బీఆర్ఎస్ కోసం చేసింది కాదని తెలంగాణ కోసం చేసిందన్నారు.

ఆర్టీసీ సమ్మె వేళ ప్రయాణికులకు HYD మెట్రో గుడ్ న్యూస్

Next Story