ఆర్టీసీ సమ్మె వేళ ప్రయాణికులకు HYD మెట్రో గుడ్ న్యూస్

by Prasad Jukanti |   (  Updated:2026-04-22 08:23:47  IST  )

ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న వేళ హైదరాబాద్ మెట్రో రైలు కీలక నిర్ణయం తీసుకుంది.

ఆర్టీసీ సమ్మె వేళ ప్రయాణికులకు  HYD మెట్రో గుడ్ న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ఆర్టీసీ సమ్మెతో బస్సులు ఎక్కడికక్కడ డిపోలకే పరిమితం అయ్యాయి. అద్దె బస్సులు నడుస్తున్నా అవి పాక్షికంగా ఉండటంతో రోజువారీ ఉద్యోగాలు, వ్యాపారాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైళ్ల సర్వీసుల ఫ్రీక్వెన్సీని గరిష్ట స్థాయికి పెంచాలని నిర్ణయించింది. ఆర్టీసీ (TGRTC) సమ్మెను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ మెట్రో రైలు ఎల్‍టీఎంఆర్‍హెచ్ఎల్‌తో సంప్రదింపులు జరిపింది. దీంతో హైదరాబాద్ ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించేందుకు మెట్రో సర్వీసులను పెంచినట్లు హెచ్ఎంఆర్ఎల్ ఎండీ పేర్కొన్నారు.

గరిష్ఠంగా 56 రైళ్లు:

సాధారణ రోజుల్లో ఉదయం 8.00 గంటల నుండి 10.30 గంటల వరకు, సాయంత్రం 5.00 గంటల నుండి 8.00 గంటల వరకు పీక్ అవర్స్‌లో 56 రైళ్లు నడుస్తాయి. ఈ సమయంలో రెండు రైళ్ల మధ్య నిడివి 3 నిమిషాలు 40 సెకన్లు ఉంటుంది. నాన్-పీక్ అవర్స్‌లో మియాపూర్ – ఎల్‌బీ నగర్ (C1) కారిడార్‌లో 4 నిమిషాలు 50 సెకన్లు, నాగోల్ – రాయదుర్గ్ (C3) కారిడార్‌లో 5 నిమిషాలు 20 సెకన్ల నిడివితో 44 రైళ్లు నడుస్తున్నాయి. కానీ ఆర్టీసీ సమ్మెను దృష్టిలో ఉంచుకొని రోజంతా గరిష్టంగా 56 రైళ్లు నడపాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. మియాపూర్ – ఎల్‌బీ నగర్ కారిడార్‌లో 4 నిమిషాలు 20 సెకన్ల గ్యాప్‌తో, నాగోల్– రాయదుర్గ్ కారిడార్‌లో 3 నిమిషాలు 40 సెకన్ల గ్యాప్‌తో రైళ్లు నడుస్తాయని దీనితో పాటు ప్రజలకు కలిగే ఇబ్బందులను తగ్గించేందుకు రాత్రి 11.00 గంటల తర్వాత కూడా చివరి మెట్రో రైలు సర్వీసును పొడిగించే అవకాశాన్ని పరిశీలిస్తోందని తెలిపారు.

ఇప్పుడే వస్తామని వెళ్లి తిరిగి రాలేదు.. ఆర్టీసీ జేఏసీ నేతలపై పొన్నం సంచలన వ్యాఖ్యలు

Next Story