న్యాయం చేయండి మహాప్రభో : వృద్ధ దంపతుల నిరసన

by Batti.Sumithra |

ఆక్రమణదారుడి నుంచి తమ భూమిని కాపాడాలని తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు ఇరువురు వృద్ద దంపతులు.

న్యాయం చేయండి మహాప్రభో : వృద్ధ దంపతుల నిరసన
X

దిశ, కొణిజర్ల : ఆక్రమణదారుడి నుంచి తమ భూమిని కాపాడాలని తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు ఇరువురు వృద్ద దంపతులు. రెవెన్యూ రికార్డు పరంగా తమకు చట్టబద్ధమైన హక్కు ఉన్న భూమిని అజయ్ కుమార్ అనే వ్యక్తి దౌర్జన్యంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తూ తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నాడని బాధితులు కన్నీటి పర్యంతమౌతున్నారు. తన బంధువు జిల్లా స్థాయిలో ఉన్నత పదవిలో ఉన్నాడని మీ అంతు చూస్తా అంటూ బెదిరిస్తున్నారని సదరు వ్యక్తి నుంచి తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం వృద్ధ దంపతులు ఇరువురు తమ బిడ్డలు అల్లుళ్ళతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని గుబ్బగుర్తి గ్రామ రెవెన్యూ పరిధిలో మేకలగుంట గ్రామ సమీపంలో సర్వేనెంబర్ 454/ఇ/1/1లో 2.04 ఎకరాలు మీర్జా అమీర్ బీకి తన తల్లి నుంచి వారసత్వంగా సంక్రమించింది.

సదరు భూమికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పట్టాదారు పాస్ పుస్తకం తో పాటు ధరణి భూభారతి పాస్ పుస్తకాలు వచ్చాయి. తాము అభాగ్యం అనే ఉద్దేశంతో భూమిని అజయ్ కుమార్ అనే వ్యక్తి దౌర్జన్యంగా ఆక్రమించుకున్నాడని బాధితులు ఆరోపించారు. దీనిపై పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సివిల్ వ్యవహారం కావడంతో పోలీసులు పట్టించుకోవడంలేదని దీంతో మరింత రెచ్చిపోయి తమను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని తనకు అత్యంత సమీప బంధువు జిల్లా స్థాయి అధికారి కావడంతో ఆయన పేరు చెప్పి మీ అంత చూస్తానని బెదిరిస్తున్నాడని రెండు రోజుల క్రితం తమ ఇంటి పైకొచ్చి బండ బూతులు తిట్టి చంపుతామని బెదిరించారని విచారించి న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు. చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటాం: తహసీల్దార్ అరుణ నిరసన వద్దకు వచ్చి బాధితులతో మాట్లాడారు. విచారించి చట్టపరిధిలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Next Story