ఉపాధి హామీ పనిదినాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ ద్వంద్వ వైఖరి ?

by Batti.Sumithra |

ఉపాధి హామీ పథకం కూలీ పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామానికి చెందిన గ్రామస్తులు ఫీల్డ్ అసిస్టెంట్ మెరిగే శ్రీను పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

ఉపాధి హామీ పనిదినాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ ద్వంద్వ వైఖరి ?
X

దిశ, గరిడేపల్లి : ఉపాధి హామీ పథకం కూలీ పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామానికి చెందిన గ్రామస్తులు ఫీల్డ్ అసిస్టెంట్ మెరిగే శ్రీను పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గ్రామంలోని అర్హులైన పేద కూలీలకు పనిదినాలు ఇవ్వకుండా, డబ్బులు ఇచ్చిన వారికే పనులు కల్పిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం గ్రామానికి చెందిన పలువురు ఉపాధి హామీ కూలీలు ఫీల్డ్ అసిస్టెంట్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. కుటుంబంలో జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ 120 రోజుల పనిదినాలు కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ, కీతవారిగూడెంలో మాత్రం ఆ ఆదేశాలు అమలు కావడం లేదని ఆరోపించారు.

తమకు కేవలం 80 నుంచి 90 రోజుల వరకు మాత్రమే పనిదినాలు నమోదు చేస్తున్నారని, కొంతమందికి మాత్రం పూర్తి స్థాయిలో పనిదినాలు కల్పిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. భూములు ఉన్నవారికి ఎక్కువగా పనులు కల్పిస్తూ, నిజమైన పేద కూలీలను పట్టించుకోవడం లేదని వాపోయారు. గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, తనకు నచ్చిన వారికి మాత్రమే పనిదినాలు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. డబ్బులు, మద్యం ఇస్తేనే పనిదినాలు నమోదు చేస్తున్నారని కూలీలు ఆరోపించారు. అంతేకాకుండా, కొందరు ఎలాంటి పని చేయకుండానే ఫోటోలు దిగి వెళ్లిపోతున్నారని, అలాంటి వారి పేర్ల పై కూడా పనిదినాలు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

Next Story