చర్లపల్లి సెంట్రల్ జైలులో ఐటీఐ ఏర్పాటు.. ఖైదీల జీవితాలకు కొత్త దారి

by Ramesh Naini |   (  Updated:2026-06-15 15:20:35  IST  )

శిక్ష పూర్తి చేసుకుని జైలు నుంచి బయటకు వెళ్లే ఖైదీలు గౌరవప్రదంగా జీవించేలా, వారికి ఉపాధి మార్గాలను చూపే దిశగా తెలంగాణ కారాగార శాఖ కీలక అడుగు వేసింది.

చర్లపల్లి సెంట్రల్ జైలులో ఐటీఐ ఏర్పాటు.. ఖైదీల జీవితాలకు కొత్త దారి
X

దిశ, తెలంగాణ బ్యూరో: శిక్ష పూర్తి చేసుకుని జైలు నుంచి బయటకు వెళ్లే ఖైదీలు గౌరవప్రదంగా జీవించేలా, వారికి ఉపాధి మార్గాలను చూపే దిశగా తెలంగాణ కారాగార శాఖ కీలక అడుగు వేసింది. హైదరాబాద్‌లోని చర్లపల్లి కేంద్ర కారాగారంలో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ ఐటీఐ ఏర్పాటు చేస్తోంది. ఖైదీలకు కేవలం శిక్ష విధించడమే కాకుండా, వారిలో మార్పు తీసుకువచ్చి సమాజంలో తిరిగి మంచి పౌరులుగా ఎదిగేలా చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చూట్టామని డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా అన్నారు. ఇందులో భాగంగా ఆమె అదివారం హైదరాబాద్‌లోని నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ మహిళల కోసం ఏర్పాటు చేసిన ఎన్ఎస్టీఐ విభాగాలను సందర్శించారు. ఐటీఐ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

వృత్తి విద్యా కోర్సుల్లో సాంకేతిక శిక్షణ

ఐటీఐ ద్వారా ఖైదీలకు వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో సాంకేతిక శిక్షణ ఇచ్చి, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దనున్నారు. దీనివల్ల ఖైదీలు విడుదలయ్యాక ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ఆత్మవిశ్వాసంతో తమ కాళ్లపై తాము నిలబడే అవకాశం కలుగుతుంది. శిక్షణ పొందుతున్న అభ్యర్థులు, అధ్యాపకులతో మాట్లాడి వృత్తి విద్యా శిక్షణ వల్ల కలిగే ప్రయోజనాలు, ఉపాధి అవకాశాలపై ఆరా తీశారు. అనంతరం ప్రాంతీయ నైపుణ్యాభివృద్ధి సంచాలకులు రవి చిలుకోటి, ఎన్ఎస్టీఐ మహిళా విభాగం ప్రిన్సిపాల్ ప్రియ లతో సమావేశమై, జైలులో ఐటీఐ ఏర్పాటుకు అవసరమైన సహకారం విధానాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎన్. మురళీ బాబు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ డాక్టర్ డి. శ్రీనివాస్, పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం. ఖాలిద్ అఖ్తర్, చెర్లపల్లి జైలు సూపరింటెండెంట్ జి. ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.

Next Story