8 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షించాలి : కృషాంక్ మన్నే

by Batti.Sumithra |

కంటోన్మెంట్ పరిధిలోని తిరుమలగిరి మండలం తొకట్టలో ఉన్న సుమారు రూ.800 కోట్ల విలువైన 8 ఎకరాల ప్రభుత్వ భూమిని భూ కబ్జాదారుల నుండి పరిరక్షించాలని బీఆర్ఎస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ క్రిశాంక్ మన్నె అన్నారు.

8 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షించాలి : కృషాంక్ మన్నే
X

దిశ, కార్వాన్ : కంటోన్మెంట్ పరిధిలోని తిరుమలగిరి మండలం తొకట్టలో ఉన్న సుమారు రూ.800 కోట్ల విలువైన 8 ఎకరాల ప్రభుత్వ భూమిని భూ కబ్జాదారుల నుండి పరిరక్షించాలని బీఆర్ఎస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ క్రిశాంక్ మన్నె అన్నారు. ఈ మేరకు సోమవారం లకిడికాపూల్ లోని హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలకు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ తొకట్ట గ్రామంలోని సర్వేనంబర్ 157/1లో ఉన్న 8 ఎకరాల భూమి పోరంబోకు ప్రభుత్వ భూమిగా గుర్తించబడిందని, ఈ భూమి దశాబ్దాలుగా న్యాయపరమైన, పరిపాలనా ప్రక్రియలకు లోబడి ఉందని పేర్కొన్నారు. 2025లో కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ భూమిలో 6,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిపాదించారని గుర్తుచేశారు.

ఆ ప్రతిపాదనలో సైతం ఈ స్థలాన్ని ప్రభుత్వ భూమిగానే పరిగణించారని తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ భూమి ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లినట్లు, చుట్టూ ప్రహరీ నిర్మించబడినట్లు సమాచారం రావడంతో స్థానిక ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. ప్రభుత్వ హక్కుగా గుర్తించబడిన విలువైన ప్రజా ఆస్తి ఎలా ప్రైవేట్ ఆధీనంలోకి వెళ్లిందనే అంశం పై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. భూమి హక్కులు, సరిహద్దులు, స్వాధీనం స్థితి తదితర అంశాలపై అధికారులు తక్షణమే దర్యాప్తు చేయాలని కోరారు. అవసరమైతే న్యాయపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, అక్రమాలు, అధికార దుర్వినియోగం లేదా ఆర్థిక అవకతవకలు జరిగి ఉంటే వాటి పై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, ప్రతిపాదిత 6,000 ఇందిరమ్మ ఇళ్ల ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. ప్రజా ఆస్తుల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అని, ఈ వ్యవహారంలో సంపూర్ణ పారదర్శకత పాటించాలని సూచించారు. వినతిపత్రాన్ని స్వీకరించిన కలెక్టర్ ప్రియాంక ఆల, అంశాన్ని సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు క్రిశాంక్ తెలిపారు.

Next Story