- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రైమ్ జరగకముందే అలర్ట్.. టెక్నాలజీతో ఖాకీల నయా స్కెచ్
నేరగాడు ఒక అడుగు ముందుంటే.. పోలీసులు వంద అడుగులు ముందుండాలనేది పాత సామెత. కానీ, నేరగాడు అడుగు వేయకముందే పోలీసులకు సమాచారం ఉండాలనేది నేటి ఆధునిక సూత్రం. దీనిని నిజం చేస్తూ రాష్ట్ర పోలీస్ శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అస్త్రాన్ని ప్రయోగించింది...

దిశ, తెలంగాణ బ్యూరో: నేరగాడు ఒక అడుగు ముందుంటే.. పోలీసులు వంద అడుగులు ముందుండాలనేది పాత సామెత. కానీ, నేరగాడు అడుగు వేయకముందే పోలీసులకు సమాచారం ఉండాలనేది నేటి ఆధునిక సూత్రం. దీనిని నిజం చేస్తూ రాష్ట్ర పోలీస్ శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అస్త్రాన్ని ప్రయోగించింది. రాష్ట్రవ్యాప్తంగా నేరాల నియంత్రణ, దర్యాప్తులో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు స్మార్ట్ క్రైమ్ అనలిటిక్స్ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ వ్యవస్థ కేవలం నేరాలను విశ్లేషించడమే కాకుండా, పోలీసుల పనితీరులో పారదర్శకతను పెంచుతూ బాధితులకు తక్షణ న్యాయం అందేలా ఒక కవచంలా పనిచేస్తోంది.
నేరం జరగకముందే గస్తీకి ప్లాన్..హీట్ మ్యాప్స్‌తో హాట్‌స్పాట్ల గుర్తింపు..
గతంలో ఏదైనా నేరం జరిగినప్పుడు పాత రికార్డులను తిరగేయడానికి పోలీసులకు గంటల సమయం పట్టేది. కానీ ఈ స్మార్ట్ అనలిటిక్స్ వ్యవస్థ సెకన్ల వ్యవధిలో సమాచారాన్ని అందిస్తుంది. ముఖ్యంగా క్రైమ్ మ్యాపింగ్ ద్వారా ఏ ప్రాంతంలో ఏ తరహా నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయో కృత్రిమ మేధ విశ్లేషిస్తుంది. చోరీలు, చైన్ స్నాచింగ్, మహిళా వేధింపులు వంటి నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను ఈ వ్యవస్థ హీట్ మ్యాప్స్ గా విడగొడుతుంది. దీనివల్ల ఏ సర్కిల్‌లో గస్తీ పెంచాలో, ఎక్కడ నిఘా ఉంచాలో పోలీసులకు ముందే స్పష్టత వస్తుంది. పండుగలు, శుభకార్యాల సమయాల్లో దొంగతనాలు పెరిగే అవకాశాలను గత పదేళ్ల డేటా ఆధారంగా విశ్లేషించి, సీజనల్ ట్రెండ్స్‌ను కూడా ఈ వ్యవస్థ ముందే పసిగట్టి అధికారులను అప్రమత్తం చేస్తుంది.
ఫీడ్‌బ్యాక్ నేరుగా జిల్లా ఎస్పీ డాష్‌బోర్డ్‌లో...
పోలీసింగ్ వ్యవస్థలో బాధితులకు మరింత ప్రాధాన్యత ఇచ్చేందుకు డిజిటల్ విక్టిమ్ ఫీడ్‌బ్యాక్ విధానాన్ని కూడా ఈ వ్యవస్థలో అంతర్భాగం చేశారు. ఏదైనా కేసు నమోదైనప్పుడు దర్యాప్తు అధికారి ఎలా స్పందిస్తున్నారు, బాధితుడితో ఎలా
వ్యవహరించారు అన్న అంశాలపై బాధితులు నేరుగా తమ మొబైల్ ఫోన్ నుంచే రేటింగ్ ఇచ్చే సౌకర్యం కల్పించారు. ఈ ఫీడ్‌బ్యాక్ నేరుగా జిల్లా ఎస్పీ లేదా ఉన్నతాధికారుల డాష్‌బోర్డ్‌లో కనిపిస్తుంది. దీనివల్ల కిందిస్థాయి సిబ్బందిలో జవాబుదారీతనం పెరగడంతో పాటు, బాధితులకు కేసు స్టేటస్‌పై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు వెళ్లడం వల్ల వారు స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం తప్పుతుంది.
నిరంతరం పాత నేరస్తుల కదలికలను ట్రాకింగ్..
రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానించే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్ కు ఏఐని జోడించడం ద్వారా దర్యాప్తులో వేగం పెరిగి. ఒకే నేరగాడు వేర్వేరు జిల్లాల్లో వేర్వేరు పేర్లతో నేరాలకు పాల్పడినా, ఫేషియల్ రికగ్నిషన్, వేలిముద్రల విశ్లేషణతో క్షణాల్లో పట్టుకోవచ్చు. డేటా ఇంటిగ్రేషన్ వల్ల పాత నేరస్తుల కదలికలను ఇంటెలిజెన్స్ విభాగం నిరంతరం ట్రాక్ చేస్తూ, అనుమానాస్పద కదలికలను గుర్తించగలుగుతుంది.
చారు సిన్హా: ఐపీఎస్, డీజీపీ, సీఐడీ, ఏసీబీ, ఎఫ్‌ఏసీ మహిళా భద్రతా విభాగం..
సాంప్రదాయ పోలీసు విచారణా పద్ధతులకు స్వస్తి చెప్పి, సాంకేతికతో నేరరహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా.. త్వరలోనే ఈ వ్యవస్థలో మెషిన్ లెర్నింగ్ మోడ్యూల్స్ జోడించి, సైబర్ నేరాలను సైతం ముందే పసిగట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ప్రజల గోప్యతకు భంగం కలగకుండా, వారి డేటాకు పటిష్టమైన భద్రత కల్పిస్తున్నాం.. ఈ స్మార్ట్ పోలీసు విధానంతో ప్రజలకు పోలిసులపై మరింత నమ్మకం పెరుగుతుంది..






