- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నపూర్ణ రిజర్వాయర్‌లో విషాదం.. నీటిలో మునిగి బాలిక మృతి
పోచమ్మ బోనాల సందర్భంగా బంధువుల ఇంటికి వచ్చిన ఓ బాలిక ప్రమాదవశాత్తు రిజర్వాయర్‌లో పడి మృతి చెందింది.

దిశ, ఇల్లంతకుంట: పోచమ్మ బోనాల సందర్భంగా బంధువుల ఇంటికి వచ్చిన ఓ బాలిక ప్రమాదవశాత్తు రిజర్వాయర్‌లో పడి మృతి చెందిన విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామానికి చెందిన వెంకటాపురం కీర్తన (10) తన కుటుంబ సభ్యులతో కలిసి పోచమ్మ బోనాల సందర్భంగా తిప్పాపూర్ గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చింది. అనంతరం గ్రామ శివారులో ఉన్న అన్నపూర్ణ రిజర్వాయర్‌ను చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లింది. ఈ క్రమంలో రిజర్వాయర్ వద్ద కాలు జారడంతో కీర్తన నీటిలో పడిపోయి మునిగిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆమెను బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇల్లంతకుంట ఎస్సై అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా చెరువులు, డ్యాంలు, రిజర్వాయర్ల వద్దకు వెళ్లే సమయంలో తల్లిదండ్రులు చిన్నారుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, నీటి వనరుల సమీపంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సూచించారు. ఈ ఘటనతో కీర్తన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.






