జీవీకే గౌతమి పవర్‌కు హైకోర్టు షాక్.. రిట్ పిటిషన్ కొట్టివేత, రూ.లక్ష జరిమానా

by Kema Shiva Kumar |

విద్యుత్ నియంత్రణ కమిషన్ల ఉత్తర్వుల అమలు కోసం నేరుగా హైకోర్టును ఆశ్రయించిన జీవీకే గౌతమి పవర్ లిమిటెడ్‌కు తెలంగాణ హైకోర్టు రూ.లక్ష జరిమానా విధించింది.

జీవీకే గౌతమి పవర్‌కు హైకోర్టు షాక్.. రిట్ పిటిషన్ కొట్టివేత, రూ.లక్ష జరిమానా
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ నియంత్రణ కమిషన్లకు తమ ఉత్తర్వులను అమలు చేసే సర్వాధికారాలు ఉన్నాయని, వాటిని కాదని నేరుగా హైకోర్టును ఆశ్రయించడం సమంజసం కాదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. విద్యుత్ నియంత్రణ కమిషన్లు సివిల్ కోర్టులకు ప్రత్యామ్నాయంగా పనిచేసే సంస్థలని గుర్తు చేస్తూ.. జీవీకే గౌతమి పవర్ లిమిటెడ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఒక దిగువ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వును అమలు చేయించేందుకు రిట్ పిటిషన్‌ను వసూళ్ల ప్రక్రియగా ఉపయోగించుకోలేరని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్‌లో ఎలాంటి మెరిట్స్ లేవని తేల్చిన జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం.. పిటిషనర్ సంస్థకు రూ. లక్ష జరిమానా విధించింది.

ఏపీలో సంస్థ.. పిటిషన్ ఇక్కడ

ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టుకు ప్రాదేశిక అధికార పరిధి లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని పెద్దాపురంలో ఉన్న సంస్థకు సంబంధించిన అంశాలపై ఇక్కడ పిటిషన్ వేయడాన్ని తప్పుపట్టింది. అదే సమయంలో, ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించిన అంశంపై లోతైన విచారణకు ఆదేశించింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు భారీ క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, వాటిని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు ఎందుకు ప్రస్తావించలేదో తేల్చాలని ఆదేశించింది. దీనిపై ఏపీ, తెలంగాణ ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ల బాధ్యతను గుర్తించి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.

అసలు ఏంటి వివాదం..

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు తమకు రూ. 24.28 కోట్ల కనీస ప్రత్యామ్నాయ పన్ను (MAT)తో పాటు వడ్డీని చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ జీవీకే గౌతమి పవర్స్ హైకోర్టును ఆశ్రయించింది. 1997లో అప్పటి ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు (APSEB)తో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం (PPA) ప్రకారం.. ఆదాయపు పన్నులు, MAT మొత్తాన్ని డిస్కమ్‌లే భరించాలని కంపెనీ వాదించింది. దీనిపై గతంలో ఏపీఈఆర్‌సీ (APERC), అప్పీలేట్ ట్రిబ్యునల్ (APTEL), సుప్రీంకోర్టులు కూడా కంపెనీకి అనుకూలంగా తీర్పులిచ్చాయని పేర్కొంది.

పరిధి లేని చోట పిటిషన్ వేసినందుకు జరిమానా..

అయితే, ఈ పిటిషన్‌ను డిస్కమ్‌లు తీవ్రంగా వ్యతిరేకించాయి. జీవీకే గౌతమి పవర్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో ఉందని, ఈ వ్యవహారంతో తెలంగాణ హైకోర్టుకు సంబంధం లేదని వాదించాయి. అంతేకాకుండా, సదరు కంపెనీ గతంలో లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా భారీ మొత్తాలను అక్రమంగా వసూలు చేసిందని, ఆ రికవరీ కోసం సీఈఆర్‌సీ (CERC) ముందుcase పెండింగ్‌లో ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లాయి. ప్రస్తుతం ఆ బకాయిల మొత్తం రూ. 1,109 కోట్లకు పైగా ఉందని వెల్లడించాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. పిటిషనర్ విన్నపాన్ని తోసిపుచ్చడమే కాకుండా, అధికార పరిధి లేని చోట పిటిషన్ వేసినందుకు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.

Next Story