హయగ్రీవ’ ఘటనతో జిల్లా వైద్యారోగ్య శాఖ అలర్ట్‌

by Batti.Sumithra |

వనస్థలిపురంలోని హయగ్రీవ ఆస్పత్రిలో పోలీసులు నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్‌లో లింగ నిర్ధారణ పరీక్షల వ్యవహారం వెలుగుచూడడంతో పాటు, ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల పై ఫిర్యాదులు అందడంతో సోమవారం వైద్యాధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు.

హయగ్రీవ’ ఘటనతో జిల్లా వైద్యారోగ్య శాఖ అలర్ట్‌
X

దిశ, వనస్థలిపురం : వనస్థలిపురంలోని హయగ్రీవ ఆస్పత్రిలో పోలీసులు నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్‌లో లింగ నిర్ధారణ పరీక్షల వ్యవహారం వెలుగుచూడడంతో పాటు, ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల పై ఫిర్యాదులు అందడంతో సోమవారం వైద్యాధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్ స్వర్ణకుమారి ఆదేశాల మేరకు తొమ్మిది తనిఖీ బృందాలుగా ఏర్పడిన అధికారులు వనస్థలిపురం, మన్సూరాబాద్, నాగోల్, హయత్‌నగర్ ప్రాంతాల్లోని ఆస్పత్రులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నక్షత్ర, లైఫ్‌కేర్, వనస్థలి, లాలిత్యం, ఆరుష్, హిమాలయ తదితర ఆస్పత్రుల్లో రికార్డులు, అనుమతులు, వైద్య సిబ్బంది అర్హతలు, ప్రభుత్వ నిబంధనల అమలును పరిశీలించారు. తనిఖీల్లో గుర్తించిన అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి డీఎంహెచ్‌వోకు సమర్పించనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో డాక్టర్ స్వర్ణకుమారి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ లేదా అనుమతులు లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్య భద్రతకు విఘాతం కలిగించే అక్రమాలకు పాల్పడే ఆస్పత్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తనిఖీల్లో బయటపడిన లోపాల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

Next Story