- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIRAL : పీరియడ్స్ అత్యవసర పరిస్థితి కాదా?
ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చూశాక ఆడపిల్లకు మనం ఎలాంటి గౌరవం ఇస్తున్నాం? వారి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మనది అంటే సమాజానికి కాదా?

దిశ, ఫీచర్స్ : ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చూశాక ఆడపిల్లకు మనం ఎలాంటి గౌరవం ఇస్తున్నాం? వారి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మనది అంటే సమాజానికి కాదా? అనే ఆలోచన తొలిచి వేసింది. బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు అనుకోకుండా రుతుక్రమం స్టార్ట్.. ప్యాడ్ తెచ్చుకోలేని ఆమెదే తప్పు అందామా? కన్నీళ్లు పెట్టుకుంటూ సీట్‌లో నుంచి కదలకుండా కూర్చోమని చెప్పుదామా? నువ్వు అమ్మాయివి కాబట్టి ఈ అవమానాన్ని భరించాల్సిందేనని చేతులు దులుపుకుందామా? ప్రభుత్వం ఎలాంటి బాధ్యత తీసుకోవాలి? ఓ పౌరుడిగా నువ్వు చేయాల్సిందేంటి?
ఫేస్ బుక్ పోస్ట్
ఒక ఆడపిల్ల అనుకోని సమయంలో పీరియడ్స్ వచ్చి, బస్సు సీట్లోనే కూర్చుని ఎవరికీ చెప్పుకోలేక ఏడుస్తూ, ఇబ్బంది పడుతోంది. కామారెడ్డి బస్సు దిగిన తర్వాత వాళ్ళ అమ్మగారు కంగారుగా నా దగ్గరికి వచ్చి.. ‘బాబు, ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా మెడికల్ షాప్ ఉందా?’ అని అడిగారు. నేను దగ్గర్లోని మెడికల్ షాప్ ఉంటుందని చెప్పి.. ఏమైందమ్మా అని అడిగితే మా అమ్మాయికి కొంచెం ఇబ్బంది కలిగింది మీరు ఏమైనా సహాయం చేయగలరా అని అడిగారు. నేను ఆ పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే నేనే వెళ్లి మెడికల్ షాప్‌లో ప్యాడ్స్ కొని తెచ్చి వాళ్లకు ఇచ్చాను. అప్పుడు ఆ తల్లి కళ్లల్లో చూసిన కృతజ్ఞత, ఆ అమ్మాయి ముఖంలో చూసిన ఉపశమనం నన్ను తీవ్రంగా ఆలోచింపజేశాయి.
ఆ సమయంలో నా మనసులో ఒక బలమైన ప్రశ్న మొదలైంది. ఒక ఆడపిల్ల ఆత్మగౌరవాన్ని, ఆరోగ్యాన్ని కాపాడటం కేవలం ఆ కుటుంబం బాధ్యతేనా? సమాజానిది కాదా? మహిళల రక్షణ, ప్రయాణ సౌకర్యాల గురించి మాట్లాడే మన ప్రభుత్వాలకు, అలాగే మన TSRTC సంస్థకు ఈ విషయంలో ఒక ప్రత్యేక బాధ్యత ఉండాలి కదా? మనం బస్సుల్లో ప్రయాణికుల రక్షణ కోసం ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు పెడతాం.. అత్యవసరమైతే వాడుకోవడానికి మందులు ఉంచుతాం. మరి మహిళలకు ప్రకృతి సిద్ధంగా వచ్చే ఈ నెలసరి (పీరియడ్స్) అత్యవసర పరిస్థితి కాదా? ప్రయాణంలో అనుకోకుండా పీరియడ్స్ వస్తే ఆ ఆడబిడ్డ పడే నరకం వర్ణనాతీతం. ఆ సమయంలో వారు పడే మానసిక, శారీరక వేదనను దూరం చేయడం మన బాధ్యత. అందుకే మన బస్టాండ్‌లలో, అలాగే ప్రతి ఆర్టీసీ బస్సులో ఒక చిన్న బాక్స్ ఏర్పాటు చేసి.. అందులో శానిటరీ ప్యాడ్స్ అందుబాటులో ఉంచితే ఎంత బాగుంటుంది? ఓ ఆడపిల్ల ఆత్మగౌరవాన్ని, ఆరోగ్యాన్ని గౌరవించడమే కదా. ఆ బాధ్యత ప్రతి ప్రభుత్వానిది, ప్రతి సంస్థది, ప్రతి పౌరుడిది.
కానీ సమాజం ఎలా ఉంది?
ఎక్కడో కొందరు మాత్రమే ఇలా ఆడపిల్లల నెలసరి నొప్పి, వారు పడే నరకయాతనను అర్థం చేసుకునేవాళ్లు ఉంటారు. కానీ చాలా మంది దీన్ని ఇంకా చర్చించకుండా వదిలేసే చర్యగానే చూస్తున్నారు. ఇంట్లో ఎంత మంది అన్నాదమ్ములు ఉన్నా పీరియడ్ వచ్చిందంటే.. అంత నొప్పితోనైనా ఆమె షాపుకు వెళ్లి శానిటరీ ప్యాడ్స్ తెచ్చుకుంటుంది. లేదంటే తల్లో, చెల్లో తెచ్చిపెడుతుంది. కారణం అలాంటి ప్యాక్ అబ్బాయి పట్టుకుంటే ఓ హేళన. అదే అమ్మాయి చేతిలో కనిపిస్తే ఏదో తప్పు చేసిందనే చిన్న చూపు. ఎందుకిలా..? ఇప్పటికీ షాపుల్లో శానిటరీ ప్యాడ్ ఇవ్వమంటే నల్ల కవర్‌లోనో, న్యూస్ పేపర్‌లోనో చుట్టిస్తున్నారంటే.. మనం, మన ఆలోచనల మెచ్యూరిటీ ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. మన విద్యా విధానాలు, వ్యవస్థ వల్లనే ఇలాంటి సమస్య ఉత్పన్నమవుతుందనేది నిజం. ఎందుకంటే.. ఓ సార్ గారు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పమంటే చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నాడు. జననాంగాలంటే ఎందుకంత పాపం అన్నట్లు చూడాలి. శరీర అవయవాల్లో ప్రకృతి సహజమైన అంగాలుగా చెప్పాలి కదా.
విదేశాల్లో పరిస్థితి ఏంటి?
న్యూస్ పేపర్ రక్తాన్ని పీల్చుకోగలదు, కానీ సమాజపు సిగ్గును పీల్చుకోలేదు అని.. పీరియడ్స్ పై అవగాహన కల్పించేందుకు విదేశాల్లో వినూత్న ఆలోచనలతో ముందుకొస్తున్నారు. సౌత్ ఆఫ్రికాకు చెందిన ‘The Star’ పత్రిక పీరియడ్స్ పేదరికం (Period Poverty)పై అవేర్‌నెస్ కల్పించేందుకు.. తమ మొదటి పేజీపై వాస్తవిక రక్తపు మరకలను ముద్రించి సంచలనం సృష్టించింది. సుమారు 40 లక్షల మంది బాలికలు శానిటరీ ప్యాడ్స్ కొనుగోలు చేయలేక న్యూస్ పేపర్లు, పాత బట్టలు, బూడిదను వాడుతున్నారనేది అత్యంత బాధాకరమైన నిజం. కాగా ఒకవైపు విదేశాల్లో ఇలాంటి సాహసోపేతమైన విప్లవాత్మక మార్పులు వస్తుంటే.. మన దేశంలో మాత్రం ప్యాడ్స్‌ను కవర్లలో దాచిపెట్టడం.. పీరియడ్స్ గురించి మాట్లాడటానికి సిగ్గుపడటం ఇంకా చూస్తూనే ఉన్నాం. ఇలాంటి అత్యంత సహజమైన శారీరక ప్రక్రియను ఒక రహస్యంగా, అవమానంగా చూడటం సమాజం ఎప్పుడు ఆపుతుంది?






