Huzurabad : మూడేళ్ల బుడతడు.. అసాధారణ జ్ఞాపకశక్తి..

by Sujitha Rachapalli |

రెండు, మూడు ఏళ్ల పిల్లలు సరిగ్గా మాట్లాడేందుకే ఇబ్బంది పడుతారు. వచ్చీ రాని మాటలతో ముద్దొస్తుంటారు. అమ్మ ఒడి, ఆటలో మునిగి తేలుతారు.

Huzurabad : మూడేళ్ల బుడతడు..  అసాధారణ జ్ఞాపకశక్తి..
X

దిశ, ఫీచర్స్ : రెండు, మూడు ఏళ్ల పిల్లలు సరిగ్గా మాట్లాడేందుకే ఇబ్బంది పడుతారు. వచ్చీ రాని మాటలతో ముద్దొస్తుంటారు. అమ్మ ఒడి, ఆటలో మునిగి తేలుతారు. కానీ ఈ బుడుతడు మాత్రం తన అసాధారణ జ్ఞాపకశక్తితో అబ్బురపరుస్తున్నాడు. రికార్డులు కొల్లగొట్టేస్తున్నాడు. ఇంతకీ బుడ్డోడి టాలెంట్ ఏంటి తెలుసుకుందాం పదండి..

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని బండ అంకుస్ కాలనీకి చెందిన స్నేహ-అర్జున్ దంపతులకు మూడేళ్ల కొడుకు వడ్లకొండ ఇషాన్ కౌండిన్య.. ప్రస్తుతం వరంగల్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో నర్సరీ చదువుతున్నాడు.

​చిన్న వయసులోనే తన మెమొరీ పవర్‌తో వావ్ అనిపిస్తున్నాడు. ​సాధారణంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సైతం దేశంలోని రాష్ట్రాలు, రాజధానుల పేర్లు గుర్తుపెట్టుకోవడం కాస్త కష్టంతో కూడుకున్న పని. కానీ.. ఇషాన్ కౌండిన్య మాత్రం మూడేళ్ల ప్రాయంలోనే మన దేశంలోని అన్ని రాష్ట్రాలు, వాటి రాజధానుల పేర్లను చెప్తూ విస్తుపోయేలా చేస్తున్నాడు. కేవలం జనరల్ నాలెడ్జ్ మాత్రమే కాకుండా.. హిందూ సంప్రదాయ శ్లోకాలు, పద్యాలను కూడా ఎంతో స్పష్టంగా, అద్భుతంగా పఠిస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో బహుమతులు పొందాడు.

తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు?

‘ఇషాన్ చిన్నతనం నుంచే విషయాలను చాలా త్వరగా గ్రహించేవాడు. వాడి ఆసక్తిని గమనించి మేము కూడా ప్రోత్సహించాం. ఇంత చిన్న వయసులోనే వాడు చూపిస్తున్న ప్రతిభ మాకెంతో గర్వంగా ఉంది’ అని బాలుడి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ​అత్యంత ప్రతిభ కనబరుస్తున్న చిన్నారి ఇషాన్ కౌండిన్యను స్థానికులు, పాఠశాల యాజమాన్యం, పలువురు ప్రముఖులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. భవిష్యత్తులో ఈ చిన్నారి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నారు.

Next Story