మైనర్ బాలికకు న్యాయం కోసం పోరాడతాం : బీజేపీ నేతలు

by Batti.Sumithra |

రాష్ట్రంలో మహిళల రక్షణ ప్రశ్నార్థకంగా మారిందని, శాంతిభద్రతల పరిస్థితి అదుపు తప్పిందనడానికి ఖమ్మం నగరంలో జరిగిన అమానుష ఘటనే నిదర్శనమని భారతీయ జనతా పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మైనర్ బాలికకు న్యాయం కోసం పోరాడతాం : బీజేపీ నేతలు
X

దిశ, ఖమ్మం టౌన్ : రాష్ట్రంలో మహిళల రక్షణ ప్రశ్నార్థకంగా మారిందని, శాంతిభద్రతల పరిస్థితి అదుపు తప్పిందనడానికి ఖమ్మం నగరంలో జరిగిన అమానుష ఘటనే నిదర్శనమని భారతీయ జనతా పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితం ఖమ్మంలో 12 ఏళ్ల మైనర్ బాలిక పై గౌస్ పాషా అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, ఐదు అంతస్తుల భవనం పైనుంచి కిందికి తోసి హత్య చేయడానికి ప్రయత్నించిన ఘటనపై వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాక్షసత్వాన్ని తలపించే ఈ దారుణ ఘటనలో ప్రాణాపాయ స్థితిలో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని సోమవారం బీజేపీ బృందం స్వయంగా పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితిని చూసి బీజేపీ జాతీయ నాయకులు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. గౌతమ్ రావు, రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పా రెడ్డి, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలిని స్వయంగా పరామర్శించిన నాయకులు మాట్లాడుతూ, ఆమె తీవ్రమైన ట్రామాలో ఉందని, ఎవరైనా తాకితే భయంతో ఉలిక్కిపడుతోందని తెలిపారు. బాలిక వెన్నుముక దెబ్బతినడంతో రెండు కాళ్లు పక్షవాతానికి గురయ్యాయని వివరించారు. శరీరమంతా మల్టిపుల్ ఫ్రాక్చర్లు, చేతులు, పక్కటెముకలకు తీవ్ర గాయాలయ్యాయని, పన్నెండేళ్ల బాలికపై 57 ఏళ్ల వ్యక్తి చేసిన ఈ రాక్షస చర్యను మానవీయ కోణంలో ఎవరూ క్షమించలేరని పేర్కొన్నారు.

నిందితుడు రౌడీషీటర్ అని అందరికీ తెలిసి కూడా ప్రభుత్వం అతడిని కాపాడే ప్రయత్నం చేస్తోందని, ఇటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో గత ఏడాది కాలంలో సుమారు 563 పోక్సో కేసులు నమోదయ్యాయని, నమోదు అయినవే ఇన్ని ఉంటే, ఫిర్యాదు చేయలేనివి ఇంకా ఎన్ని ఉంటాయోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగిన వెంటనే బాధితురాలిని ప్రైవేట్ ఆసుపత్రి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి, ఆపై నిమ్స్‌కు తరలించినప్పటికీ, ప్రభుత్వం తరఫున కనీస ఆర్థిక సహాయం అందలేదని ఆరోపించారు. స్థానిక రాజకీయ పార్టీలకు చెందిన కార్పొరేటర్లు ఈ కేసును మాఫీ చేయడానికి ప్రయత్నించారని, వారి వివరాలను ఆర్‌టీఐ ద్వారా సేకరిస్తున్నామని తెలిపారు. నిందితుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని, బాలికకు జీవితాంతం అండగా ఉండేలా ప్రభుత్వం బాధ్యత వహించాలని వారు స్పష్టం చేశారు. నిందితుడిని బహిరంగంగా ఎన్‌కౌంటర్ చేయాలని, లేనిపక్షంలో కేసును తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన న్యాయం జరగాలని, నిందితుడికి కఠిన శిక్ష పడే వరకు బీజేపీ పోరాటం ఆపేదిలేదని హెచ్చరించారు. హోంమంత్రి, ముఖ్యమంత్రి కనీసం బాధితురాలిని పరామర్శించే మానవత్వం చూపకపోవడం సిగ్గుచేటని వారు తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితురాలికి మెరుగైన వైద్యం, తగిన ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి బాధితురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు వాకధాని పుల్లారావు యాదవ్, నంబూరి రామలింగేశ్వరరావు, నాయకులు మేకల నాగేందర్, ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు బోయల వెంకట్, మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు పమ్మీ అనిత, మంద సరస్వతి, ఫణి కుమారి, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Next Story