పంట కొనుగోళ్లపై కేంద్రం ద్వంద వైఖరి: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

by Kema Shiva Kumar |

తెలంగాణ రైతాంగం పట్ల కేంద్రం వివక్ష చూపుతోందన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

పంట కొనుగోళ్లపై కేంద్రం ద్వంద వైఖరి: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పంట కొనుగోలు చేసే విషయంలో కేంద్రం అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరి తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అన్ని పంటలు కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, రాష్ట్ర రైతాంగం పట్ల కేంద్రం వివక్ష చూపడం సమంజసం కాదన్నారు. మోదీ ప్రభుత్వం తన బాధ్యత వదిలివేసి రాష్ట్రాలపై భారం మోపడం సరికాదని, మక్కలు కొనుగోలు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు మద్దతు ధరలు ఎందుకు ప్రకటించాలని నిలదీశారు. ఇవాళ హైదరాబాద్‌లోని మార్క్‌ఫెడ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పంటల కొనుగోలు చేస్తోందని తెలిపారు. ఇప్పటికే 15 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న, రెండు లక్షల మెట్రిక్ టన్నుల జొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేసిందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి మార్క్‌ఫెడ్‌కు రూ. 4,800 కోట్ల అప్పులు ఉంటే, ఈ రెండు సంవత్సరాల్లో మరో రూ. 1,800 కోట్లు అప్పై.. ప్రస్తుతం రూ. 6 వేల కోట్ల అప్పులతో ఇబ్బందులు పడుతుందన్నారు.

పంటలను దేశంలోని వివిధ రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఎగుమతి చేసే వ్యవస్థ కేంద్రం చేతిలో ఉంటుందని, ఎంఎస్‌పీ (MSP)కి పంటలు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా తరలించుకోవచ్చని, ఈ క్రమంలో రాష్ట్రంపై వివక్షను పక్కన పెట్టి అన్ని పంటలు ఎంఎస్‌పీకి పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం నిల్వకు అవసరమైన గిడ్డంగులు కూడా కేంద్రం ఆధీనంలో ఉన్నాయని, రాష్ట్రంలో అత్యధికంగా పంటల దిగుబడి జరుగుతుండటంతో అందుకు అనుగుణంగా గోదాముల నిర్మాణాలు చేపట్టాలని కోరినా కేంద్రం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిడ్డంగులు లేకపోవడంతో పంట దిగుబడులు ఎండకు ఎండిపోయి, వర్షానికి తడిసిపోయి అటు రైతులకు, మరోవైపు కొనుగోలు చేసిన ప్రభుత్వానికి నాణ్యత లేకుండా పోతుందన్నారు.

రైతుల సమస్యలపై త్వరలో రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలవనున్నట్లు చెప్పారు. పంట మార్పిడిపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నామని, రైతులు నష్టం లేని ఉద్యానవన పంటల వైపు మారాలని కోరారు. రాష్ట్రంలో ఇప్పటికే సుమారు మూడు లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని, రాబోయే రెండున్నర సంవత్సరాల్లో సుమారు ఆరు లక్షల ఎకరాల్లో సాగు చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో మూడు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు పనిచేస్తున్నాయని, మూడు ఫ్యాక్టరీలు నిర్మాణంలో, మరో మూడు ఫ్యాక్టరీలు ప్రారంభ దశలో ఉన్నాయని పేర్కొన్నారు. రైతులు యూరియా యాప్‌పై విస్తృత అవగాహన కల్పిస్తున్నామని, ఫోన్ లేని వారు సైతం యూరియా బుక్ చేసుకునేలా క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ కమిషనర్ రాహుల్ రాజ్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, అధికారులు యాస్మిన్ బాషా తదితరులు పాల్గొన్నారు.

Next Story