Gold Imports: కొనసాగుతున్న గోల్డ్ ఫీవర్

by S Gopi |

ప్రభుత్వం గత నెలలో బంగారం, వెండి వంటి విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచినప్పటికీ, బంగారం డిమాండ్ తగ్గలేదు.

Gold Imports: కొనసాగుతున్న గోల్డ్ ఫీవర్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో బంగారం ధరలు రికార్డు స్థాయిల్లో ఉన్నప్పటికీ, దిగుమతులపై వాటి ప్రభావం కనిపించలేదు. మే నెలలో భారత పసిడి దిగుమతులు ఏడాది ప్రాతిపదికన 34 శాతం పెరిగి 3.41 బిలియన్ డాలర్ల(రూ. 32.22 వేల కోట్ల)కు చేరాయి. ఇదే సమయంలో వెండి దిగుమతులు మాత్రం 86.65 శాతం క్షీణించి కేవలం 75.57 మిలియన్ డాలర్లు(రూ. 714 కోట్లు)గా నమోదయ్యాయి. ప్రభుత్వం గత నెలలో బంగారం, వెండి వంటి విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచినప్పటికీ, బంగారం డిమాండ్ తగ్గలేదు. బంగారం దిగుమతుల పెరుగుదల మే నెల వాణిజ్య లోటు 28.21 బిలియన్ డాలర్లకు చేరడానికి కూడా ఒక ప్రధాన కారణంగా నిలిచింది. ఏప్రిల్-మే కాలాన్ని పరిశీలిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు 60.14 శాతం పెరిగి 9.04 బిలియన్ డాలర్ల(రూ. 85.42 వేల కోట్ల)కు చేరాయి. భారత్ దిగుమతి చేసుకునే బంగారంలో అత్యధిక వాటా స్విట్జర్లాండ్‌దే అయినప్పటికీ, అక్కడి నుంచి వచ్చే సరఫరా క్షీణించింది. చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారుగా ఉన్న భారత్‌లో ఆభరణాల పరిశ్రమ అవసరాలే ఈ దిగుమతులకు ప్రధాన కారణం. అయితే బంగారం దిగుమతులు పెరగడం వల్ల విదేశీ మారకద్రవ్య వ్యయం అధికమై, దేశ కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ)పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Next Story