భూమి గట్టు వివాదం : వ్యక్తిని రాళ్లతో కొట్టి హత్య

by Batti.Sumithra |

నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని రోటిగడ్డ తండాలో భూమి గట్టు వివాదం నేపథ్యంలో పాలివారి మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తిని రాళ్లతో కొట్టి హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది.

భూమి గట్టు వివాదం : వ్యక్తిని రాళ్లతో కొట్టి హత్య
X

దిశ, చింతపల్లి : నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని రోటిగడ్డ తండాలో భూమి గట్టు వివాదం నేపథ్యంలో పాలివారి మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తిని రాళ్లతో కొట్టి హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం చింతపల్లి మండలంలోని రోటిగడ్డ తండాకు చెందిన నేనావత్ రవీందర్ నాయక్, ఆయన పాలివారైన నేనావత్ రాజేందర్ నాయక్, నేనావత్ రవి నాయక్‌లకు తక్కళ్లపల్లి గ్రామ సమీపంలో మూడు ఎకరాల భూమి ఉంది. గతంలో ఆ భూమిని పంచుకొని ఎవరి వాటాను వారు సాగు చేసుకుంటున్నారు. అయితే, భూమి గట్టు విషయంలో వివాదం తలెత్తడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

మాటామాటా పెరగడంతో కట్టెలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో పాటు రాళ్లు కూడా విసురుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని గొడవను ఆపేందుకు ప్రయత్నించారు. అప్పటికే నేనావత్ రవీందర్ నాయక్ తలకు, శరీరంపై తీవ్ర గాయాలు కావడంతో పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన రవీందర్ నాయక్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు గ్రామస్తులు, బంధువులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రవీందర్ నాయక్‌పై దాడి చేసి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. మృతుడి భార్య, బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story