- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gold: చమురు ధరలు పడిపోవడంతో బంగారం మెరుపు
అమెరికా ఫెడరల్ రిజర్వ్ నుంచి వడ్డీ రేట్ల పెంపు అవకాశాలపై మార్కెట్ ఆందోళనలు తగ్గడంతో బంగారం ధరలకు ఊతం లభించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదరడం, హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకునే సంకేతాలు రావడంతో అంతర్జాతీయ చమురు ధరలు గణనీయంగా తగ్గాయి. అదే సమయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ నుంచి వడ్డీ రేట్ల పెంపు అవకాశాలపై మార్కెట్ ఆందోళనలు తగ్గడంతో బంగారం ధరలకు ఊతం లభించింది. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. చమురు ధరలు దిగిరావడంతో పాటు, రూపాయి విలువ బలోపేతం కావడం వల్ల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర శుక్రవారంతో పోలిస్తే ఏకంగా రూ. 2,500 పెరిగి.. రూ. 1,51,680కి చేరింది. కేవలం పసిడి మాత్రమే కాదు, వెండి కూడా వరుసగా రెండో రోజు తన జోరును కొనసాగించింది. కిలో వెండి ధర ఏకంగా రూ. 5,000 పెరిగి.. మార్కెట్లో రూ. 2,65,700ని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర 3 శాతం (121 డాలర్లు) ఎగబాకి ఔన్స్‌కు 4,340 డాలర్ల మార్కును దాటగా, వెండి 4 శాతం పెరిగి ఔన్స్‌కు 70.74 డాలర్లకు చేరడం బులియన్ మార్కెట్ ట్రెండ్‌ను స్పష్టం చేస్తోంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన పసిడి 10 గ్రాములు రూ. 2,450 పెరిగి రూ. 1,51,640 ఉండగా, ఆభరణాల్లో వాడే 22 క్యారెట్ల బంగారం రూ. 2,250 పెరిగి రూ. 1,38,900కి చేరింది. వెండి రూ. 10 వేలు పెరిగి కిలో రూ. 2.80 లక్షలకు చేరుకుంది. బంగారంతో పాటు ఇతర విలువైన లోహాలు కూడా లాభపడ్డాయి. వెండి 3.7 శాతం, ప్లాటినం 3.4 శాతం, పల్లాడియం 4.4 శాతం పెరగడం ద్వారా కమోడిటీ మార్కెట్‌లో సానుకూల ధోరణి కనిపిస్తోంది.






