- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమ్మ మాట – అంగన్ వాడీ బాట కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క
రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల నమోదు పెంపు పై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) తెలిపారు.

దిశ, హైదరాబాద్ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల నమోదు పెంపు పై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) తెలిపారు. సోమవారం మాసాబ్‌ట్యాంక్‌లోని మురాద్‌నగర్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్న ఎంజీ నగర్–2 అంగన్‌వాడీ కేంద్రం, చాచా నెహ్రూ పార్క్ సమీపంలో నిర్వహించిన "అమ్మ మాట – అంగన్‌వాడీ బాట" కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి నూతన విద్యా సంవత్సరానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యుడు మాజిద్ హుస్సేన్, ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజ, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలతో కలిసి చిన్నారులకు రెండు జతల యూనిఫారాలు పంపిణీ చేశారు. అనంతరం పలకపై అక్షరాభ్యాసం చేయించి, విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేశారు. చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించిన మంత్రి సీతక్క, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న ప్రాథమిక బాల్య విద్యా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని వారిని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారుల సమగ్ర అభివృద్ధిలో నాణ్యమైన ప్రీ-స్కూల్ విద్యతో పాటు పోషకాహారం కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి చిన్నారిని అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించి, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అందిస్తున్న సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని తల్లిదండ్రులు, ప్రజలకు సూచించారు. అంతకుముందు "అమ్మ మాట – అంగన్‌వాడీ బాట" నినాదాలతో నిర్వహించిన అవగాహన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో తమ పిల్లలను నమోదు చేయాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.






