- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొదటి రోజే నీటి కష్టాలు.. విద్యార్థుల అవస్థలు
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు సోమవారం పునఃప్రారంభ ఏమైనప్పటికీ, కొన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత యథాతథంగా కొనసాగుతోంది.

దిశ, కారేపల్లి : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు సోమవారం పునఃప్రారంభ ఏమైనప్పటికీ, కొన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత యథాతథంగా కొనసాగుతోంది. ముఖ్యంగా తాగునీటి సమస్య, అపరిశుభ్రమైన మరుగుదొడ్లు విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీనికి కారేపల్లి మండలంలోని విశ్వనాథపల్లి ప్రాథమిక పాఠశాల ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. గత విద్యా సంవత్సరంలో 28 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో, ప్రస్తుత విద్యాసంవత్సరం తొలి రోజున కేవలం 23 మంది మాత్రమే హాజరైనట్లు ఉపాధ్యాయులు తెలిపారు. పాఠశాలలో నెలకొన్న సమస్యల కారణంగానే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పాఠశాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా అందుబాటులో ఉన్నప్పటికీ, పైప్‌లైన్ కనెక్షన్ సమస్యల కారణంగా నీళ్ల ట్యాంకులో నీరు చేరడం లేదని సమాచారం. దీంతో విద్యార్థులకు తాగునీరు అందని పరిస్థితి నెలకొంది.
మరుగుదొడ్లలో నీటి సదుపాయం లేకపోవడంతో అవి అపరిశుభ్రంగా మారి, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతే కాకుండా, మధ్యాహ్న భోజనాన్ని సిద్ధం చేసేందుకు కూడా వంట సిబ్బంది బయటి నుంచి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలను ముందుగానే అందజేస్తున్నప్పటికీ, స్థానిక స్థాయిలో కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా మౌలిక సదుపాయాల సమస్యలు కొనసాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్, మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో), మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) తక్షణమే స్పందించి పాఠశాలలో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
సమస్యలు వెంటాడుతున్న పాఠశాలల పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించకపోతే ప్రభుత్వ విద్యా వ్యవస్థ పై ప్రజల్లో విశ్వాసం మరింత తగ్గిపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, కొందరు ఉపాధ్యాయులు పాఠశాల సమయాల్లో మొబైల్ ఫోన్ల వినియోగానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. విద్యాబోధనకు ఎలాంటి అంతరాయం కలగకుండా పాఠశాలకు వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు తమ మొబైల్ ఫోన్లను కార్యాలయ గదిలో ఉంచే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనతోనే సాధ్యమవుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. విశ్వనాథపల్లి ప్రాథమిక పాఠశాలలో నెలకొన్న సమస్యలను జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని వెంటనే పరిష్కరించి, ప్రభుత్వ విద్యావ్యవస్థ పై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంపొందించాలని గ్రామస్థుల విజ్ఞప్తి చేస్తున్నారు.






