- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్‍లో పవర్ ఫుల్ లీడర్‍గా రేవంత్ రెడ్డి.. అధిష్టానం వద్ద పెరిగిన గ్రాఫ్
కేరళలో యూడీఎఫ్ విజయం వెనుక రేవంత్ రెడ్డి వ్యూహాలు ఫలించాయి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం వద్ద ఆయన ఇమేజ్ మరియు ప్రాధాన్యత మరింత పెరిగింది.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశరాజకీయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మరోసారి చర్చనీయాశంగా మారింది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) విజయం వెనుక రేవంత్ రెడ్డి అనుసరించిన వ్యూహాలు హస్తం పార్టీలో ఆసక్తిని రేపుతున్నాయి. ఈ దెబ్బతో రేవంత్ రెడ్డి ఇమేజ్ మరోసారి కాంగ్రెస్ అధిష్టానం వద్ద మరింత పెరిగినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తనకు ఇచ్చిన అవకాశాన్ని వాడుకుని ఎల్‍డీఎఫ్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో రేవంత్ రెడ్డి పోషించిన పాత్ర గేమ్ చేంజర్ గా మారిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన నాటి నుండి రేవంత్ రెడ్డి నిరంతరం తన ఫర్మార్మెన్స్ చూపిస్తుండగా తాజాగా కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళి ఆయనను జాతీయ కాంగ్రెస్‍లో తానేంటో చూపిస్తూ అధిష్టానం పెద్దల మన్ననలు పొందుతున్నారనే టాక్ వినిపిస్తోంది. తనదైన దూకుడుతో సొంత రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్సార్‍ను తలపిస్తున్నారని జాతీయ స్థాయిలో అధిష్టానానికి మంచి ఆప్షన్‍గా మారుతున్నారనే చర్చ గుప్పుమంటోంది.
తెలంగాణలో జోరు:
పీసీసీ హోదాలో ఉంటూ 2023లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన నాటి నుండి ముఖ్యమంత్రి అయ్యాక వరుస విజయాలతో రేవంత్ రెడ్డి గ్రాఫ్ నిరంతరం పెరుగుతూనే ఉంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుండు సున్నా తెప్పిస్తానని చెప్పి మరీ ఆ పార్టీని జీరో సీట్లకు పరిమితం చేయడంతో పాటు రాష్ట్రంలో జరిగిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలను కాంగ్రెస్ ఖాతాలో వేయించగలిగారు. ఇక ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రత్యర్థులు ఎన్ని ఆరోపణలు చేసినా లోకల్ బాడీ ఎన్నికల్లో అధికార పార్టీదే పై చేయిగా నిలపడంలో రేవంత్ రెడ్డి వ్యూహాలు ఫలించాయి. ఈ పరిణామాలతో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఇటీవల పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి.
జాతీయ స్థాయిలో స్పీడ్:
గత నెలలో లోక్ సభలో కేంద్రం ప్రవేశపెట్టిన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అంశానికి సంబంధించిన బిల్లుపై రేవంత్ రెడ్డి తన మార్క్ చూపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో డీలిమిటేషన్ కార్యక్రమానికి మోడీ సర్కార్ శ్రీకారం చుడుతోందంటూ రేవంత్ రెడ్డి అగ్గిరాజేశారు. ఆ బిల్లును అడ్డుకుని చూపిస్తామని సవాల్ విసిరారు. అందుకు తగ్గట్టుగానే ఈ విషయంలో దేశంలో మిగతా ముఖ్యమంత్రులందరికంటే రేవంత్ రెడ్డినే పెద్ద ఎత్తున చర్చ జరిగేలా వ్యూహం రచించారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ ఏకంగా పార్లమెంట్‍లోనే ప్రస్తావరణకు వచ్చిందంటే ఆయన వ్యూహం ఏ మేరకు ఫలించిందో అర్థం చేసుకోవచ్చని రేవంత్ అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే మహిళా బిల్లుకు సంబంధించిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. దాంతో రేవంత్ రెడ్డి పేరు జాతీయ స్థాయిలో మార్మోగింది.
దూకుడు వైఖరే బలం:
తాజాగా కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయి వ్యూహకర్తగా నిలబెట్టేలా చేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అప్పటి వరకు బీజేపీ వర్సెస్ ఎల్‍డీఎఫ్ కూటమి మధ్య సాగుతున్న ప్రచార పర్వాన్ని ఎవరూ ఊహించని రీతిలో పినరయి విజయన్‍పై మాటల యుద్ధానికి తెర లేపి గేమ్‍ను పూర్తిగా ఎల్‍డీఎఫ్ వర్సెస్ యూడీఎఫ్‍గా మార్చివేశారు. ఏదైనా రాష్ట్రంలో మేనిఫెస్టో ప్రకటించాలంటే అది అధిష్టానం పెద్దల సమక్షంలో జరుగుతుంది. కానీ ఏఐసీసీ కేరళలో మాత్రం ఆ అవకాశం రేవంత్ రెడ్డికి అప్పగించింది. అంటే రేవంత్ రెడ్డిని పార్టీ పెద్దలు మరింత విశ్వసిస్తున్నారని ఆ విశ్వాసం నిలబెట్టుకునేలా రేవంత్ రెడ్డి వ్యూహరచన చేసి కేరళలో కాంగ్రెస్ కూటమిని అధికారం దిశగా నడిపించడంలో కీలక పాత్ర పోషించానే చర్చ జరుగుతోంది. తనకున్న దూకుడు తత్వం రేవంత్ రెడ్డి ప్రచార శైలి, ప్రత్యర్థులపై ఆయన చేసే విమర్శలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పినరయి విజయన్ వంటి సీనియర్ నాయకులను సైతం ధీటుగా ఎదుర్కోవడం వల్ల ఆయన కేరళలో కీ రోల్ గా మారడంతో కాంగ్రెస్‍లో రేవంత్ రెడ్డి గ్రాఫ్ మరింత పెరిగిందని ఆయన ఆలోచనలకు మరింత మద్దతు అధిష్టానం పెద్దల వద్ద దక్కే అవకాశం ఉండబోతున్నట్లు తెలుస్తోంది.






