గోదావరి వరదల సన్నద్ధతపై జిల్లా అధికారులతో సమీక్షించిన మంత్రి తుమ్మల.. కీలక ఆదేశాలు జారీ

by Jakkula.Mamatha |

గోదావరి నదిలో వరదల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

గోదావరి వరదల సన్నద్ధతపై జిల్లా అధికారులతో సమీక్షించిన మంత్రి తుమ్మల.. కీలక ఆదేశాలు జారీ
X

దిశ, కొత్తగూడెం ప్రతినిధి : గోదావరి నదిలో వరదల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, వైరా శాసనసభ్యులు రామదాసు నాయక్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు, రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావుతో కలిసి గోదావరి వరదల సన్నద్ధతపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ అంకిత్ వరదల సన్నద్ధతలో భాగంగా జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలను మంత్రికి వివరించారు. జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ఈ ఏడాది నుంచి మండల స్థాయిలో తహసీల్దార్ కార్యాలయాల్లో మండల ఎమర్జెన్సీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో వరదల సమయంలో చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను గుర్తించి, వైద్యం, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్, ఇరిగేషన్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ తదితర శాఖల ద్వారా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేసి, క్విక్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ గోదావరి వరదల సమయంలో ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు పోలీసు శాఖ పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, రెవెన్యూ, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ తదితర శాఖలతో సమన్వయంగా సహాయక చర్యలు చేపడతామని తెలిపారు. ప్రజలు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎలినోవో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రతి శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వరదల అనంతరం అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పారిశుధ్య చర్యలను ముమ్మరం చేయాలని, వైద్యశాఖ అధికారులు అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. భద్రాచలం పట్టణంలో గోదావరి నీరు చేరకుండా, వర్షపు నీరు వేగంగా నదిలోకి వెళ్లేలా పంపింగ్ మోటార్లను సిద్ధంగా ఉంచాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. తాగునీరు, వైద్యం వంటి అత్యవసర సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు.

వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడంతో పాటు వ్యవసాయ అధికారులు రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందించాలని అన్నారు. గిరిజన రైతులు ఉద్యానవన పంటల సాగుపై దృష్టి సారించేలా అవగాహన కల్పించాలని, ఎరువులు, ముఖ్యంగా యూరియా వినియోగం పై శాస్త్రీయ అవగాహన కల్పించాలని సూచించారు. వనమహోత్సవంలో భాగంగా జాతీయ రహదారుల వెంట విస్తృతంగా మొక్కలు నాటాలని, వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాను పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దాలని మంత్రి పిలుపునిచ్చారు. జిల్లాలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనులు, పుష్కరాలు ఏర్పాట్లు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి భద్రాచలం–కూనవరం రహదారిపై చేపడుతున్న కరకట్ట నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను ఆరా తీశారు. మూడు సంవత్సరాలుగా పనులు పూర్తి కాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సారపాక జాతీయ రహదారిపై ఐటీసీ ఈస్ట్ గేట్ సమీపంలో గోదావరి వరదల సమయంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ ప్రాంతంలో జాతీయ రహదారి ఎత్తును పెంచేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసి చర్యలు చేపట్టాలని జాతీయ రహదారుల శాఖ అధికారులను ఆదేశించారు.

భద్రాచలం, పినపాక ఎమ్మెల్యే లు తెల్లం వెంకట్రావు , పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వరదల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖలు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. వరదలకు ముందు, వరదల సమయంలో, అనంతరం చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర సన్నద్ధతతో ఉండాలని, వర్షపాతం, వరద పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కోరారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా వ్యవహరించాలని , గోదావరి వరదల సమయంలో బూర్గంపాడు, అశ్వాపురం ప్రాంతాలు అధికంగా ప్రభావితమవుతాయని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఐటిడిఎ పీఓ రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శేష్ట, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం ఆర్డీవో మధు, వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్, వైద్య, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్, అటవీ, అగ్నిమాపక, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story