- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
' సీఎం సభకు ఏర్పాట్లు సిద్ధం.. '
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 28న నల్లగొండ జిల్లాకు రానున్నారు.

దిశ, నల్లగొండ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 28న నల్లగొండ జిల్లాకు రానున్నారు. హ్యామ్ (HAM) పథకం కింద రూ.13,006 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రహదారుల పనులకు కనగల్ కేంద్రంలో శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం శంకుస్థాపన పైలాన్ నిర్మాణాన్ని అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. శంకుస్థాపన అనంతరం నల్లగొండలోని ఎన్‌జీ కళాశాల ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభకు వచ్చే ప్రజలు కూర్చునేందుకు మైదానంలోని రెండు వైపులా భారీ టెంట్లు ఏర్పాటు చేశారు. అయితే, ముఖ్యమంత్రి ఒకవైపు టెంట్ కింద ఏర్పాటు చేసిన ప్రధాన వేదికపై నుంచి ప్రసంగించనున్నారు. మరోవైపు ఉన్న ప్రజలు, కార్యకర్తలు సభను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఎల్‌ఈడీ స్క్రీన్లను అధికారులు ఏర్పాటు చేశారు.
ర్యాంపు ఏర్పాటు చేయాలని పార్టీ నేతల ఒత్తిడి..
రెండు వైపులా ఏర్పాటు చేసిన టెంట్లలో ఉన్న ప్రజలను ముఖ్యమంత్రి స్వయంగా కలిసి అభివాదం చేసేలా రెండు వేదికల మధ్య ర్యాంపు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. అయితే, రెండు వేదికల మధ్య దూరం ఎక్కువగా ఉండటంతో ర్యాంపు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని అధికారులు పేర్కొంటున్నారు. ఒకవేళ ర్యాంపు ఏర్పాటు చేయకపోతే సభకు హాజరయ్యే ప్రజలు, కార్యకర్తల్లో కొంత అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.






