మీరు గుండెలు బాదుకున్న ఎస్ఐఆర్ ఆగదు: కిషన్ రెడ్డి

by Prasad Jukanti |

ఎస్ఐఆర్ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.

మీరు గుండెలు బాదుకున్న ఎస్ఐఆర్ ఆగదు: కిషన్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎస్ఐఆర్ అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ గుండెలు బాదుకుంటున్నాయని మీరు గుండెలు బాదుకున్న ఈ ప్రక్రియ ఆగదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎస్ఐఆర్ చేశారని కానీ ఇప్పుడు జరుగుతున్న సవరణపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఎస్ఐఆర్ చేసిన రాష్ట్రాల్లో పోలింగ్ శాతం భారీగా పెరిగిందన్నారు. ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగ బద్ధమైన స్వతంత్ర కమిషన్ అని అది తన పని తాను చేసుకుంటూ వెళ్తోందన్నారు. డూప్లికేట్‌ ఓట్లు, దొంగఓట్లను తొలగించేందుకే ఈసీ సర్‌ ప్రక్రియను చేపట్టినట్లు వివరించారు. ఎలక్షన్ కమిషన్ మీద బురదజల్లే ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తున్నారన్నారు. ఎలక్షన్ కమిషన్ విషయంలో ప్రళయం సృష్టిస్తానని చెప్పిన రాహుల్ గాంధీ ఏ రకంగా నవ్వుల పాలయ్యారో దేశమంతా చూసిందన్నారు.

వాళ్ల పప్పులు ఉడకవనే విమర్శలు:

ఓటర్ల జాబితా సవరణ అనేది నిరంతర ప్రక్రియ అని దీన్ని రాజకీయం చేయాలని చూడటం దురదృష్టకరం అన్నారు. ఎస్ఐఆర్ లో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల విమర్శలన్నీ నిరాధారమైనవని బాధ్యాతారాహిత్యమైనవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీఎల్ఓల చేత ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయిస్తున్నారని దీనిపై తాము ఎలక్షన్ కమిషన్ కు ఫోటోలతో సహా ఫిర్యాదు చేశామన్నారు. దీనిపై ఈసీ కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. బీఎల్ ఓలకు ఐడీ కార్డులు ఈసీ నుంచి రావాలని కానీ కొన్ని చోట్ల తెలంగాణ ప్రభుత్వం పేరుతో ఇస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు ధైర్యంగా ఎస్ఐఆర్‍ను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. అధికారులకు ఎదైనా సమస్యలు ఉంటే వారికి బీజేపీ అండగా ఉంటుందన్నారు. లండన్‍లో వెళ్లి బారిష్టర్ చదివిన అసదుద్దీన్ ఓవైసీ రాజ్యంగం గురించి అబద్ధాలు ఎలా చెప్పాలో నేర్చుకుని వచ్చారని, ఎస్ఐఆర్ సక్రమంగా జరిగితే మా పప్పులు ఉడకవని ఓవైసీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ రకంగా మాట్లాడుతున్నారన్నారు.

Next Story