- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో పోరాటానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి : మాజీ మంత్రి పువ్వాడ
ఆనాడు తెలంగాణ కోసం ప్రణాళిక బద్దంగా ఎలా పోరాటం జరిపామో... ఈనాడు ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి మరో పోరాటానికి సిద్ధం కావాలని కార్యకర్తలకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు.

దిశ, భద్రాచలం : ఆనాడు తెలంగాణ కోసం ప్రణాళిక బద్దంగా ఎలా పోరాటం జరిపామో... ఈనాడు ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి మరో పోరాటానికి సిద్ధం కావాలని కార్యకర్తలకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. భద్రాచలంలో శనివారం జరిగిన బీఆర్ఎస్ ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మాయ మాటలతో, అమలు గాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం సగం పాలన కూడా పూర్తికాకముందే చతికిలపడిందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది అన్నారు. సీఎం రేవంత్ ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు కప్పం కట్టే సీఎం నేనని, ఆయన ప్రజలకు జవాబుదారీ కాదని విమర్శించారు. తన పదవిని కాపాడుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాడు తప్ప, ప్రజల కోసం పనిచేయడం లేదని ఆరోపించారు.
మళ్లీ గులాబీ జెండా ఎగిరి తీరుతుంది : ఎమ్మెల్సీ తాత మధు
భద్రాచలంలో బీఆర్ఎస్ తరఫున గెలిచిన తెల్లం వెంకట్రావు ఎలాంటి జిత్తుల మారి నక్కో.. అన్ని వర్గాల ప్రజలకు అర్థమయిందని, ఇక ఆయనకు ఇదే చివరి ఎన్నికని, డిపాజిట్లు దక్కే పరిస్థితి కూడా లేదన్న విషయం ఇప్పటికే తేటతెల్లమైందని, బీఆర్ఎస్ మళ్లీ భద్రాచలం నియోజకవర్గంలో గెలిచి తీరుతుందని ఎమ్మెల్సీ తాత మధు జోష్యం చెప్పారు. డాక్టర్ తెల్లం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశాడని ఆయన దుయ్యబట్టారు. ఇలాంటి వ్యక్తులకు రాజకీయాల్లో స్థానం ఉండదని పేర్కొన్నారు. ఈ విషయం ఆయనకు కూడా అర్థమైందని, అందుకే ఇటీవల కాలంలో ముందస్తు జాగ్రత్తగా అన్ని సర్దుకుంటున్నారని ఆరోపించారు. భద్రాచలం బిఆర్ఎస్ అడ్డా అని వెల్లడించారు.
కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి : ఎమ్మెల్సీ తక్కిళ్ళపల్లి
ప్రభుత్వం నిర్వహించే సర్ ప్రోగ్రాంను పరిశీలిస్తూ.. ఓటు నమోదు సరళి పై అవగాహన కలిగి, బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ సూచించారు. బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా పార్టీ సూచనలు పాటించాలని తెలిపారు. పార్టీ పునర్నిర్మాణం జరుగుతోందని, ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని సూచించారు. త్వరలోనే అన్ని రకాల కమిటీలు వేయటం జరుగుతుందని, కష్టపడిన వారికి తప్పకుండా తగిన గుర్తింపు లభిస్తుందని వెల్లడించారు. స్థానిక సమస్యలపై దృష్టి పెట్టి తగు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రజావ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలో ఖండించాలని సూచించారు. ఈ దగాకోరు ప్రభుత్వ వైఫల్యాలను వీధి వీధికి తీసుకెళ్లాలని కోరారు. రాబోయేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, పార్టీకి మంచి రోజులు రానున్నాయని ఆయన జోష్యం చెప్పారు.
ఈ సమావేశంలో నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి రావులపల్లి రాంప్రసాద్, నియోజవర్గ నాయకులు మానే రామకృష్ణ, గొడవర్తి నరసింహమూర్తి, బోదెబోయిన బుచ్చయ్య, మాజీ ఎంపీపీ రేసు లక్ష్మి, గంప రాంబాబు, పెనుమల్లు రామకృష్ణారెడ్డి, దొడ్డి తాతారావు, కనితి రాముడు, రావులపల్లి పృద్వి, ఆకోజు సునీల్ కుమార్, కోటగిరి ప్రమోద్ కుమార్, రేపాక పూర్ణచంద్రరావు, అయినవోలు పవన్ కుమార్, కావూరి గోపి, తెల్లం లక్ష్మీనారాయణ, నియోజకవర్గంలో ఉన్న గ్రామపంచాయతీ బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు మండల నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






