ఇంటింటి సర్వేలో కౌన్సిలర్లదే హవా..

by Batti.Sumithra |   (  Updated:2026-06-27 15:52:13  IST  )

కామారెడ్డి పట్టణంలో ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే కార్యక్రమంలో కౌన్సిలర్ల హవా కొనసాగుతోంది.

ఇంటింటి సర్వేలో కౌన్సిలర్లదే హవా..
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలో ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే కార్యక్రమంలో కౌన్సిలర్ల హవా కొనసాగుతోంది. బీఎల్ఓలు, అంగన్‌వాడీ టీచర్లు, వాలంటీర్లతో నిర్వహించాల్సిన సర్వేను స్థానిక కౌన్సిలర్లు తమ గుప్పిట్లో పెట్టుకుని నడిపిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

బీఎల్ఓలను బెదిరింపులకు గురిచేస్తూ సర్వే చేయిస్తున్న కౌన్సిలర్లు

ఇంటింటి సర్వే కోసం నియమించిన బీఎల్ఓలను కొందరు కౌన్సిలర్లు బెదిరింపులకు గురిచేస్తున్నారు. తమ వార్డుల్లో తాము చెప్పినట్లే నమోదు చేయాలని, తమ అనుచరుల పేర్లు, ఓట్లు చేర్చాలని ఒత్తిడి తెస్తున్నారు. సర్వే బృందంతో పాటు కౌన్సిలర్లు, వారి అనుచరులు వెళ్తూ బీఎల్ఓల పై పెత్తనం చలాయిస్తున్నారు. దీంతో బీఎల్ఓలు స్వతంత్రంగా పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది.

రాజకీయ ఒత్తిళ్లతో నివేదికలు తారుమారు..

సర్వేలో కుటుంబ సభ్యుల వివరాలు, కొత్త ఓటర్ల నమోదు, తొలగింపులు పారదర్శకంగా జరగాలి. కానీ కౌన్సిలర్ల జోక్యంతో అసలైన లబ్ధిదారుల పేర్లు గల్లంతవుతున్నాయని, తమకు అనుకూలమైన వారి పేర్లు అదనంగా చేరుస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. కొన్ని చోట్ల చనిపోయిన వారి పేర్లు తొలగించకుండా, వలస వెళ్లిన వారి పేర్లు అలాగే ఉంచుతున్నారని సమాచారం.

నిస్సహాయ స్థితిలో బీఎల్ఓలు, అంగన్‌వాడీ టీచర్లు..

బీఎల్ఓలుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు కౌన్సిలర్ల ఒత్తిడితో సతమతమవుతున్నారు. పై అధికారులకు ఫిర్యాదు చేస్తే రాజకీయ వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడుతున్నారు. "మేము నిబంధనల ప్రకారం చేయాలని చూస్తే కౌన్సిలర్లు బెదిరిస్తున్నారు. ఉద్యోగం కాపాడుకోవాలంటే వారు చెప్పినట్లే చేయాల్సి వస్తోంది" అని ఓ బీఎల్ఓ ఆవేదన వ్యక్తం చేశారు.

పారదర్శకత కొరవడుతుందని ప్రజల ఆందోళన..

ప్రభుత్వ పథకాల అమలు, ఓటరు జాబితా సవరణ కోసం చేపట్టిన ఈ సర్వే రాజకీయ జోక్యంతో నీరుగారిపోతోందని ప్రజలు మండిపడుతున్నారు. కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ జోక్యం చేసుకుని కౌన్సిలర్ల పెత్తనం లేకుండా స్వతంత్రంగా సర్వే జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేకపోతే సర్వే లక్ష్యం దెబ్బతింటుందని, అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై స్థానిక తహసీల్దార్‌ను వివరణ కోరగా, తనకు క్లారిటీ లేదని తెలిపారు.

Next Story