- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరకట్ట నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల
భద్రాద్రిలోకి ఒక్క చుక్క వరదనీరు కూడా రాకుండా కరకట్టను పటిష్టంగా నిర్మించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

దిశ, భద్రాచలం : భద్రాద్రిలోకి ఒక్క చుక్క వరదనీరు కూడా రాకుండా కరకట్టను పటిష్టంగా నిర్మించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. 70 అడుగులకు పైగా వరద వచ్చినా భద్రాచలం పట్టణంలోకి వరదనీరు రాకుండా కరకట్ట విస్తరణ పనులను నీటిపారుదల శాఖ, జాతీయ రహదారుల శాఖ అధికారులు సమన్వయంతో వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను మంత్రి ఆదేశించారు. భద్రాచలంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న కరకట్ట పనులను మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1986 సంవత్సరంలో భద్రాచలంలో సంభవించిన గోదావరి జలప్రళయాన్ని పరిగణనలోకి తీసుకుని నూతనంగా కరకట్ట నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో భద్రాచలం వద్ద గోదావరి కరకట్ట నిర్మాణం చేపట్టడం వల్ల భద్రాచలం పట్టణంతో పాటు పరివాహక ప్రాంతాలను గోదావరి వరద తాకిడి నుంచి చాలా వరకు రక్షించగలిగామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి కరకట్ట విస్తరణకు రూ.38 కోట్లు మంజూరు చేయడంతో విస్తరణ పనులు చేపట్టామని చెప్పారు.
భద్రాచలం పట్టణానికి కరకట్ట శ్రీరామరక్షగా నిలిచిందని పేర్కొన్నారు. నూతనంగా నిర్మిస్తున్న కరకట్టపై నుంచి క్రాసింగ్ అయ్యే జాతీయ రహదారి వంతెన డిజైన్‌లో జాప్యం కారణంగా కరకట్ట నిర్మాణ పనులు కొంత ఆలస్యమయ్యాయని తెలిపారు. ప్రస్తుతం కరకట్ట నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు, సందేహాలు లేనందున నీటిపారుదల శాఖ అధికారులు, జాతీయ రహదారుల శాఖ ఇంజినీర్లు పరస్పర సమన్వయంతో నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాబోయే గోదావరి వరదలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని సూచించారు. గోదావరి వరదల సమయంలో భద్రాచలం పరిసర ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించే విధంగా కరకట్ట నిర్మాణాన్ని నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీవో బి. రాహుల్, సబ్ కలెక్టర్ మృణాళ్ శ్రేష్ఠ, నీటిపారుదల శాఖ అధికారులు, జాతీయ రహదారుల శాఖ ఇంజినీర్లు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






