RBI: డిజిటల్ మోసాలపై ఆర్‌బీఐ కొత్త అస్త్రం

by S Gopi |

అనుమానాస్పద లావాదేవీలను, అకౌంట్లలో జరిగే సందేహాస్పద వ్యవహారాలను ఈ ఏఐ సిస్టమ్స్ రియల్ టైమ్‌లో పసిగడతాయి. అంటే, కస్టమర్ తన డబ్బును నష్టపోకముందే బ్యాంకులు ఆ అలర్ట్‌ను పట్టుకోగలవన్నమాట.

RBI: డిజిటల్ మోసాలపై ఆర్‌బీఐ కొత్త అస్త్రం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఒక ఫేక్ కేవైసీ మెసేజ్.. తెలియక నొక్కిన ఒక ఫిషింగ్ లింక్.. అంతే, అకౌంట్ లోని డబ్బులు మాయం! ఇప్పటివరకు సైబర్ మోసగాళ్లు 'ఎలాగూ బాధితులకు డబ్బులు తిరిగిరావు' అనే ధీమాతో రెచ్చిపోయేవారు. ఫిర్యాదు చేసినా విచారణలు నెలల తరబడి సాగడం, చివరకు కేసులు పరిష్కారం కాకపోవడం సాధారణమైపోయింది. కానీ, ఇకపై ఆ ఆటలు సాగవు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్‌ లావాదేవీల్లో ఖాతాదారుల బాధ్యతను పరిమితం చేసేలా గత వారం కొత్త నిబంధనలను ఆర్‌బీఐ విడుదల చేసింది. 2027, జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఫ్రేమ్‌వర్క్ ప్రకారం, డిజిటల్ చెల్లింపుల మోసాలకు గురైన వినియోగదారులకు కొన్ని షరతులపై రూ.25,000 వరకు పరిహారం అందే అవకాశం కల్పించింది. మీ ప్రమేయం లేకుండా ఆన్‌లైన్ లేదా యూపీఐ (యూపీఐ) లావాదేవీల్లో మోసం జరిగిందని గుర్తించిన 5 రోజుల్లోపు బ్యాంకుకు ఫిర్యాదు చేస్తే, కొన్ని ప్రాథమిక పరిశీలనల అనంతరం ఈ పరిహారం నేరుగా మీ అకౌంట్‌కు చేరుతుంది. డిజిటల్ ఇండియాలో లావాదేవీలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో, అంతే వేగంగా పెరుగుతున్న మోసాలకు అడ్డుకట్ట వేసేందుకే ఆర్‌బీఐ ఈ అప్‌డేట్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

బ్యాంకుల వద్ద ఏఐ కాపలా

డిజిటల్ చెల్లింపుల మోసాల బాధితులకు రూ. 25,000 వరకు పరిహారంతో పాటు, అసలు మోసం జరగకుండానే ఆపేందుకు బ్యాంకుల అంతర్గత సెక్యూరిటీ సిస్టమ్స్‌ను ఆర్‌బీఐ మరింత కఠినతరం చేస్తోంది. ఇందులో భాగంగా ‘మోడల్ రిస్క్ మేనేజ్‌మెంట్’ పై కొత్త ముసాయిదా గైడ్‌లైన్స్‌ను రిలీజ్ చేసింది. దీని ప్రకారం, బ్యాంకులు తాము వాడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ మోడల్స్‌ను పూర్తిగా అప్‌గ్రేడ్ చేసుకోవాలి. అనుమానాస్పద లావాదేవీలను, అకౌంట్లలో జరిగే సందేహాస్పద వ్యవహారాలను ఈ ఏఐ సిస్టమ్స్ రియల్ టైమ్‌లో పసిగడతాయి. అంటే, కస్టమర్ తన డబ్బును నష్టపోకముందే బ్యాంకులు ఆ అలర్ట్‌ను పట్టుకోగలవన్నమాట.

మోసం జరగక ముందే పసిగట్టే టెక్నాలజీ

ప్రస్తుతం సైబర్ దొంగలు చాలా తెలివిగా కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. వీటిని పాత పద్ధతుల్లో పట్టుకోవడం బ్యాంకులకు సాధ్యం కావడం లేదు. ఈ ఏఐ సిస్టమ్స్ రియల్ టైమ్ కాపలా కాస్తూ, మీ అకౌంట్‌లో లావాదేవీలను క్షణక్షణం గమనిస్తూ ఉంటాయి. సందేహాస్పద లావాదేవీలను ఈ టెక్నాలజీ పసిగడుతుంది. ఉదాహరణకు, మీరు తరచూ హైదరాబాద్‌లో ఉంటూ రూ. 500, రూ. 1000 ఆన్‌లైన్ షాపింగ్ చేస్తుంటారనుకుందాం. కానీ సడన్‌గా అర్ధరాత్రి వేళ రష్యా నుంచో, నైజీరియా నుంచో మీ అకౌంట్ ద్వారా రూ. 50,000 డ్రా చేయడానికి ప్రయత్నం జరిగితే.. ఈ ఏఐ సాఫ్ట్‌వేర్ వెంటనే అలర్ట్ అయిపోతుంది. మీరు చేస్తున్న లావాదేవీ కాదని గమనించి, మీ జేబులోంచి డబ్బులు కట్ అవ్వకముందే ఆ ట్రాన్సాక్షన్‌ను బ్లాక్ చేస్తుంది.

ప్రపంచ దేశాల కంటే ఒక అడుగు ముందే ఉన్న ఆర్‌బీఐ

ఆర్‌బీఐ కొత్త రూల్స్ గురించి ఈవై ఇండియా రిస్క్ మేనేజ్‌మెంట్ లీడర్ అజయ్ సిరికొండ మాట్లాడుతూ.. ఆర్‌బీఐ తెచ్చిన ఈ మార్గదర్శకాలు అత్యంత కీలకమైన ముందడుగు. యూకే, యూఎస్ వంటి పెద్ద దేశాల రెగ్యులేటర్ల కంటే కూడా ఆర్‌బీఐ ఒక అడుగు ముందే ఉంది. ఇది ఏఐ టెక్నాలజీ, థర్డ్-పార్టీ సాఫ్ట్‌వేర్లు, కస్టమర్ల రక్షణను ఒకే తాటిపైకి తెచ్చిందని ప్రశంసించారు. ఇప్పటివరకు ఏఐ వాడకంపై బ్యాంకుల్లో ఉన్న కొన్ని ఇబ్బందులను ఈ కొత్త రూల్స్ క్లియర్ చేశాయి. ఏ రకమైన మోసాల నివారణకు ఎలాంటి టెక్నాలజీ వాడాలో స్పష్టత ఇవ్వడం వల్ల బ్యాంకింగ్ రంగంలో ఏఐ వినియోగం మరింత పెరగనుంది.

కస్టమర్లకు అలర్ట్.. లేట్ చేస్తే అమౌంట్ రానట్లే

ఈ కొత్త పాలసీ ద్వారా కస్టమర్లకు లభించే అతిపెద్ద బెనిఫిట్ ఏంటంటే.. మోసం జరిగినప్పుడు ఎంత వేగంగా స్పందిస్తే అంత సేఫ్. మీరు ఆన్‌లైన్ మోసానికి గురైన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా బ్యాంకును అప్రమత్తం చేయాలి. గడువు దాటిపోతే మాత్రం ఆర్‌బీఐ రూల్స్ ప్రకారం పరిహారం దక్కడం కష్టమవుతుంది. బాధితులు ఎంత త్వరగా కంప్లైంట్ ఇస్తే, సైబర్ దొంగలు ఆ డబ్బును వేరే అకౌంట్లలోకి మార్చకుండా బ్యాంకుల ఏఐ వ్యవస్థలు అంత వేగంగా ఫ్రీజ్ చేయగలవు. డిజిటల్ చెల్లింపుల యుగంలో యూజర్లకు పూర్తి భరోసా ఇచ్చేందుకే ఆర్‌బీఐ ఈ సరికొత్త రక్షణ కవచాన్ని సిద్ధం చేసింది.

Next Story