- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేఎఫ్‌సీ ‘బై వన్ గెట్ వన్’ చికెన్‌లో పురుగులు!
ప్రముఖ అంతర్జాతీయ ఫాస్ట్ ఫుడ్ సంస్థగా పేరు గాంచిన 'కేఎఫ్‌సీ' నిర్వాకం మరోసారి వివాదాస్పదమైంది.

దిశ, పేట్ బషీరాబాద్: ప్రముఖ అంతర్జాతీయ ఫాస్ట్ ఫుడ్ సంస్థగా పేరు గాంచిన 'కేఎఫ్‌సీ' నిర్వాకం మరోసారి వివాదాస్పదమైంది. ఆఫర్ల పేరుతో వినియోగదారుల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేఎఫ్‌సీలో కొనుగోలు చేసిన చికెన్‌లో పురుగులు రావడంతో ఒక వినియోగదారుడు పోలీసులను ఆశ్రయించారు. అయితే, రాత్రి ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు కేసు నమోదు కాకపోవడంపై బాధితుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కుళ్లిన చికెన్ సరఫరా..
బాధితుడు నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల శుక్రవారం కేఎఫ్‌సీలో రూ. 900 పెట్టి 'బై వన్ గెట్ వన్' ఆఫర్ కింద చికెన్ కొనుగోలు చేశారు. ఇంటికి తీసుకెళ్లి చూసేసరికి ఆ చికెన్ మొత్తం కుళ్లిపోయి, పురుగులు పట్టి ఉంది. అప్పటికే ఆ చికెన్‌ను ఇంట్లోని చిన్న పిల్లలు, పెద్దలు కొద్దిగా తినడంతో ఆందోళనకు గురైన బాధితుడు, వెంటనే కేఎఫ్‌సీ నిర్వాహకులను నిలదీశారు. అయితే వారి నుంచి ఎలాంటి సరైన సమాధానం రాకపోవడంతో, ఆయన ‘పేటబషీరాబాద్’ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
పోలీసుల వింత సమాధానం...
రాత్రి ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. పైగా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేసిన ఒక కానిస్టేబుల్.. "పురుగులు ఉన్న చికెన్‌ను పోలీస్ స్టేషన్‌కు మేం ఫోన్ చేసినప్పుడు తీసుకురావాలి” అంటూ చెప్పినట్లు బాధితుడు పేర్కొన్నారు. ఎప్పుడూ ఫోన్ చేస్తారు..?, వాళ్ళు ఫోన్ చేసేసరికి ఇప్పటికే పురుగులు ఉన్న చికెన్ ఇంకా పురుగులు పట్టదా..? అప్పుడు ఎలా విచారిస్తారు..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు కేసు నమోదు చేశారా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వడం లేదని, ఎప్పుడు ఫోన్ చేస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని ఆయన వాపోయారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న కేఎఫ్‌సీ సంస్థపై, నిర్లక్ష్యం వహిస్తున్న పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితుడు నరేష్ డిమాండ్ చేస్తున్నారు. కాగా కేఎఫ్‌సీ వాళ్ళు కూడా బాధితులపై ఫిర్యాదు చేశారు అని పోలీసులు చెబుతున్నారు అని, సీసీ కెమెరా ఫుటేజ్ చూసి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.






