మొహర్రం వేళ భారీగా ప్రజల్ని చంపేందుకు కుట్ర : భగ్నం చేసిన పోలీసులు

by Naga Rani Yarlagadda |

మొహర్రం ఊరేగింపును లక్ష్యం చేసుకుని.. భారీగా ప్రజల్ని చంపేందుకు ఓ వ్యక్తి చేసిన కుట్రను ముంబై పోలీసులు భగ్నం చేశారు.

మొహర్రం వేళ భారీగా ప్రజల్ని చంపేందుకు కుట్ర : భగ్నం చేసిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: మొహర్రం ఊరేగింపును లక్ష్యం చేసుకుని.. భారీగా ప్రజల్ని చంపేందుకు ఓ వ్యక్తి చేసిన కుట్రను ముంబై పోలీసులు భగ్నం చేశారు. ఊరేగింపులో పాల్గొనేవారికి పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన సుమారు 14,900 విషపు గుళికలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలకలమందుతో నింపిన కాప్సూల్స్ ను పంచి, భారీ మారణహోమం సృష్టించేందుకు నిందితుడు ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూణేలోని విమాన్ నగర్ ప్రాంతానికి చెందిన ఫయాజ్ ప్రేమ్ జీ ఈ ప్లాన్ చేశాడు.

ఫయాజ్ రంగుల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొద్దిరోజులుగా ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో ఉన్న ఒక గెస్ట్ హౌస్, డార్మిటరీలో ఉంటూ.. ఈ కుట్రకు ప్లాన్ చేశాడు. నగరంలోని జెజె, బైకుల్లా ప్రాంతాల మీదుగా సాగే మొహర్రం ఊరేగింపును టార్గెట్ గా చేసుకుని.. విష గుళికలు పంచి ప్రాణనష్టం సృష్టించేందుకు ప్రయత్నించాడు. అతడిని గమనించిన భద్రతా సిబ్బంది.. ఆ గుళికలను పరిశీలించి స్వాధీనం చేసుకోవడంతో భారీ ప్రమాదం తప్పింది. విచారణలో అతను చెప్పిన విషయాలు విని పోలీసులే విస్తుపోయారు. ఎలుకలమందుగా వాడే 50 కిలోల జింక్ ఫాస్పైడ్ ను వాడి కాప్సూల్స్ తయారు చేసినట్లు చెప్పాడు. మొహర్రం ఊరేగింపులో పాల్గొంటున్న ప్రజలకు ఈ రసాయన గుళికలను పంపిణీ చేస్తుండగా నిందితుడిపై పోలీసులకు అనుమానం వచ్చింది. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి ఈ గుళికల వల్ల వాంతులు, కడుపునొప్పితో బాధపడుతున్నట్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

మొత్తం 30 వేల గుళికలు తయారు చేసేందుకు ప్లాన్ చేయగా.. పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. నిందితుడిపై BNS సెక్షన్లు 109, 110, 123 కింద హత్యాయత్నం, విషప్రయోగం వంటి కేసులు నమోదు చేశారు. ఈ కేసులో అంతర్జాతీయ కోణాలు కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు 2019 నుండి 2025 మధ్య కాలంలో ఇరాన్, ఇరాక్ దేశాలకు పలుమార్లు ప్రయాణించాడని, గడిచిన ఏడాది కాలంలోనే ఏకంగా 19 సార్లు ఆ దేశాలకు వెళ్లినట్లు విచారణలో తేలింది. నిందితుడి సోదరి ఇరాన్‌లో ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తుండగా, అతని తల్లి కూడా ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. ఈ ప్రయాణాల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి, ఈ కుట్ర వెనుక ఏదైనా పెద్ద అంతర్జాతీయ నెట్‌వర్క్ ఉందా, లేదా ఎవరి ప్రోద్బలంతోనైనా అతను ఈ పని చేశాడా అనే కోణంలో పోలీసులు అతని మొబైల్ ఫోన్, డిజిటల్ రికార్డులు, బ్యాంక్ లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరం చేసినట్లు ముంబై పోలీసులు స్పష్టం చేశారు. కాగా.. షియా ఖోజా ముస్లిం వర్గానికి చెందిన ఫయాజ్ భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు.

Next Story