- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళలను మాటలు, సైగలతో వేధించినా నేరమే : సీఐడీ డీజీపీ చారుసిన్హా
పని ప్రదేశాల్లో మహిళలకు సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణం కల్పించడంలో పోలీసు అధికారుల పాత్ర అత్యంత కీలకమని సీఐడీ డీజీపీ చారు సిన్హా స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: పని ప్రదేశాల్లో మహిళలకు సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణం కల్పించడంలో పోలీసు అధికారుల పాత్ర అత్యంత కీలకమని సీఐడీ డీజీపీ చారు సిన్హా స్పష్టం చేశారు. మహిళలపై జరిగే లైంగిక వేధింపుల నివారణ చట్టం పట్ల క్షేత్రస్థాయిలో పూర్తి అవగాహన కలిగి ఉండాలని భావి పోలీసు అధికారులకు ఆమె దిశానిర్దేశం చేశారు. శనివారం తెలంగాణ పోలీస్ అకాడమీలోని సెమినార్ హాల్ 2లో 112 మంది ప్రొబేషనరీ డీఎస్పీల కోసం పని ప్రదేశాల్లో మహిళల భద్రత.. పోష్ చట్టం అమలు, మహిళలు ఎదుర్కొనే సమస్యలు అనే అంశంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ ప్రత్యేక ఆహ్వానం మేరకు డీజీపీ చారు సిన్హా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రొబేషనరీ డీఎస్పీలను ఉద్దేశించి డీజీపీ చారు సిన్హా మాట్లాడుతూ.. ఉద్యోగ స్థలాల్లో మహిళలు ఎదుర్కొనే వేధింపులు కేవలం భౌతికంగానే కాకుండా అనేక రూపాల్లో ఉంటాయన్నారు. అనుచిత పదజాలం వాడటం, అసభ్యకరమైన ప్రవర్తన, సైగలు చేయడం లేదా ఇతర అభ్యంతరకర వ్యవహారాలు కూడా లైంగిక వేధింపుల కిందకే వస్తాయని ఆమె స్పష్టం చేశారు. ఇటువంటి అంశాలను మహిళలు సకాలంలో గుర్తించి, తమకు చట్టపరంగా ఉన్న రక్షణ వ్యవస్థలను ధైర్యంగా వినియోగించుకునేలా పోలీసులు వారికి అండగా నిలవాలని సూచించారు. సమాజంలో జరుగుతున్న పలు వాస్తవ సంఘటనలను ఉదాహరణలుగా వివరిస్తూ.. ప్రతి అధికారి తమ పరిధిలో మహిళలకు భద్రతా భావాన్ని కల్పించేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె ఉద్ఘాటించారు.
అనంతరం విమెన్ సేఫ్టీ వింగ్ కౌన్సిలర్ ఇషా శర్వాణి మాట్లాడుతూ.. మహిళల భద్రత, వారి గౌరవ పరిరక్షణ విషయంలో పోలీసులు చట్టాలపై పూర్తి పట్టు సాధించడమే కాకుండా, సమాజంలో సైతం దీనిపై విస్తృతమైన అవగాహన తీసుకురావాలని పిలుపునిచ్చారు. ట్రైనింగ్ దశలోనే ఇలాంటి చట్టాలపై స్పష్టత రావడం భవిష్యత్తులో కేసుల దర్యాప్తుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ సదస్సుకు డీఎస్పీ సతీష్ లైజన్ వ్యవహరించారు.






