మల్లేపల్లి కొనుగోలు కేంద్రంలో భారీ స్కామ్.. 11 మందిపై కేసులు!

by Kodari Anjali |

మంథని మండలం మల్లేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో వెలుగుచూసిన అక్రమాల వ్యవహారంపై పెద్దపల్లి జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపింది.

మల్లేపల్లి కొనుగోలు కేంద్రంలో భారీ స్కామ్.. 11 మందిపై కేసులు!
X

దిశ,పెద్దపల్లి: మంథని మండలం మల్లేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో వెలుగుచూసిన అక్రమాల వ్యవహారంపై పెద్దపల్లి జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. రైతుల కష్టాన్ని దోచుకునేందుకు కుట్ర పన్నిన 11 మందిపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మల్లేపల్లి కొనుగోలు కేంద్రంలో సివిల్ సప్లైస్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వారి తనిఖీ నివేదికలు, పంచనామా ఆధారంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) అధికారులు మంథని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్న 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

దొంగ చిట్టీలు.. రికార్డుల మాయాజాలం..

అధికారుల ప్రాథమిక విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జి, ట్యాబ్ ఆపరేటర్, స్టాఫ్ అసిస్టెంట్ కుమ్మక్కై ఈ భారీ స్కామ్‌కు తెరతీసినట్లు గుర్తించారు. ట్యాబ్ ఆపరేటర్ ఏకంగా నకిలీ ట్రక్ చిట్టీలను సృష్టించి కొనుగోలు రికార్డుల్లో అక్రమంగా ఎంట్రీలు వేయగా, దీనికి స్టాఫ్ అసిస్టెంట్, ఇన్‌చార్జిలు వంతపాడి అక్రమ ధాన్యం రవాణాకు సహకరించారు. తనిఖీల్లో మూడు లారీల్లో అక్రమంగా తరలిస్తున్న 2,213 బస్తాల (885.20 క్వింటాళ్లు) ధాన్యాన్ని అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. అలాగే, ఏకంగా 8 నకిలీ ట్రక్ చిట్ల ద్వారా 5,421 బస్తాల (2,168.40 క్వింటాళ్లు) ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో తప్పుడు నమోదులు చేసినట్లు విచారణలో బట్టబయలైంది.

మరెవరున్నా వదిలిపెట్టం..

రైతుల శ్రమను దోపిడీ చేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, ఇప్పటికే 11 మందిపై కేసు నమోదు చేశామని కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. పోలీసుల దర్యాప్తులో ఈ స్కామ్‌లో మరెవరి ప్రమేయం ఉన్నట్లు వెలుగులోకి వచ్చినా వారిపై కూడా కఠినమైన చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, కొనుగోలు ప్రక్రియలో పూర్తి పారదర్శకతను పాటించేలా జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Next Story