IRE vs IND : రెండో టీ20లో ఏం చేస్తారో?.. భారత్‌ సిరీస్ సమం చేస్తుందా?

by Harish |

సొంతగడ్డపై న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో టీమిండియా టెస్టు సిరీస్ కోల్పోవడాన్ని భారత అభిమానులు ఇంకా మర్చిపోలేదు.

IRE vs IND : రెండో టీ20లో ఏం చేస్తారో?.. భారత్‌ సిరీస్ సమం చేస్తుందా?
X

దిశ, స్పోర్ట్స్ : సొంతగడ్డపై న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో టీమిండియా టెస్టు సిరీస్ కోల్పోవడాన్ని భారత అభిమానులు ఇంకా మర్చిపోలేదు. ఐర్లాండ్ చేతిలో ఓటమి ఆ బాధను ఇంకా రెట్టింపు చేసింది. శుక్రవారం జరిగిన తొలి టీ20లో టీమిండియా 34 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. టీ20ల్లో చివరి బంతి వరకూ విజయాన్ని అంచనా వేయలేం. వాస్తవమే. కానీ పసికూనకు భారత జట్టు కనీసం పోటీనివ్వకపోవడమే ఆందోళన కలిగించే విషయం. ముఖ్యంగా బ్యాటింగ్‌లో తేలిపోయిన తీరు అభిమానులను విస్మయానికి గురి చేసింది. అభిషేక్ తప్ప ఎవరూ ఆకట్టుకోలేదు. ఐర్లాండ్‌పై ఈ తరహాలో చేతులెత్తేయడం దారుణమనే చెప్పాలి. మరోవైపు, సంచలన ప్రదర్శన చేసిన ఐర్లాండ్.. టీమిండియాపై చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ ఓటమితో ఏ టీమ్‌నూ తక్కువ అంచనా వేయొద్దనే చేదు నిజం టీమిండియాకు అర్థమై ఉంటుంది. రెండో టీ20లో భారత ప్లేయర్లు ఏం చేస్తారో అన్న ఆందోళన అభిమానులను వెంటాడుతోంది. రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేసి పరువు కాపాడుకుంటారా? చూడాలి.

తొలి టీ20లో భారత్ ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగే. 183 పరుగుల లక్ష్యం టీమిండియాకు మరి పెద్దదేం కాదు. 200లకుపైగా టార్గెట్‌ను సులభంగా ఛేదించిన దాఖలాలు కోకోల్లలు. కానీ, పిచ్‌ను సరిగ్గా అంచనా వేయకపోవడం, పేలవ షాట్స్, సందర్భోచిత ఇన్నింగ్స్‌లు ఆడలేకపోవడం టీమిండియా పతనాన్ని శాసించాయి. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ఆరంభంలో ఆ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. కానీ, టక్కెర్, గారెత్ డెలానీ పరిస్థితిని అర్థం చేసుకుని ఆడారు. భారత్ ఇన్నింగ్స్‌లో అదే లోపించింది. అభిషేక్ ఉన్నంత సేపు ధాటిగా ఆడినా మరో ఎండ్‌లో అతనికి సహకారం లేదు. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ వంటి అనుభవం ఉన్న ప్లేయర్లు అలా వచ్చి ఇలా అవుటవడం షాక్‌కు గురిచేసింది. భారత్‌కు 9వ స్థానంలో వచ్చే హర్షిత్ రాణా వరకూ బ్యాటింగ్ లైనప్ ఉంది. కానీ, అభిషేక్ తప్ప ఎవరూ ఆకట్టుకోలేదు. ఇక బౌలర్లలో హర్షిత్ రాణా 3 వికెట్లు, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ చెరో 2 వికెట్లు తీసి రాణించారు. దూబె ఒక్క వికెటే తీసినా పొదుపుగా బౌలింగ్ చేశాడు. కానీ, ప్రసిద్ధ్ కృష్ణ మాత్రం ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. 4 ఓవర్లు వేసి ఒక్క వికెట్ తీయకపోగా 57 రన్స్ ఇచ్చాడు. 17వ ఓవర్‌లో ఏకంగా 27 రన్స్ ఇచ్చాడు. సుందర్ కూడా 16వ ఓవర్‌లో 19 పరుగులు సమర్పించుకున్నారు. ఆ రెండు ఓవర్లు ఐర్లాండ్ ఇన్నింగ్స్‌ను మార్చేశాయి.

తుది జట్టులో మార్పులు

తొలి టీ20లో ఘోర పరాజయం నేపథ్యంలో రెండో మ్యాచ్‌ కోసం తుది జట్టులో టీమ్ మేనేజ్‌మెంట్ మార్పులు చేయడం ఖాయంగానే కనిపిస్తుంది. ఓపెనర్ సంజూ శాంసన్‌ను పక్కనపెట్టనున్నట్టు తెలుస్తోంది. అతని స్థానంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని దించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్టు పలు కథనాలు పేర్కొన్నాయి. శాంసన్‌పై నమ్మకం ఉంచితే బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు జరగకపోవచ్చు. అలాగే, తొలి మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు ఇచ్చిన ప్రసిద్ధ్ కృష్ణపై వేటు వేయనున్నట్టు తెలిసింది. అతన్ని తప్పిస్తే ప్రిన్స్ యాదవ్ జట్టులోకి రానున్నాడు. స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

Next Story