రోడ్లపై భవన నిర్మాణ వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు: మల్కాజ్‌గిరి మున్సిపల్ కమిషనర్

by Kodari Anjali |

నగరంలోని ఖాళీ స్థలాలు, రోడ్లు, నాలాల్లో భవన నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను అక్రమంగా పారబోస్తే రేపటి నుంచి కఠిన చర్యలు తప్పవని మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హెచ్చరించారు.

రోడ్లపై భవన నిర్మాణ వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు: మల్కాజ్‌గిరి మున్సిపల్ కమిషనర్
X

దిశ, మేడ్చల్ బ్యూరో: నగరంలోని ఖాళీ స్థలాలు, రోడ్లు, నాలాల్లో భవన నిర్మాణ మరియు కూల్చివేత వ్యర్థాలను అక్రమంగా పారబోస్తే రేపటి నుంచి కఠిన చర్యలు తప్పవని మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. శనివారం తార్నాకలోని మున్సిపల్ ప్రధాన కార్యాలయంలో భవన నిర్మాణ వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్ల ప్రతినిధులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అనుమతి లేని ప్రదేశాల్లో అక్రమంగా వ్యర్థాలను డంపింగ్ చేయడం వల్ల ప్రజారోగ్యం, పర్యావరణం మరియు నగర పరిశుభ్రతకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలను ఉల్లంఘించే వ్యక్తులు, వాహన యజమానులు, రవాణా నిర్వాహకులతో పాటు బిల్డర్లపై కూడా భారీ జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను రవాణా చేసే అన్ని వాహనాలు తప్పనిసరిగా ప్రభుత్వం అనుమతి పొందిన అధికారిక ప్రాసెసింగ్ ప్లాంట్లకే వ్యర్థాలను తరలించాలని, అక్కడ శాస్త్రీయ పద్ధతుల్లో వాటి పారవేత, రీసైక్లింగ్ జరిగేలా చూడాలని సూచించారు. 20 వేల చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో జరిగే పెద్ద పెద్ద నిర్మాణాలు, రోడ్లు, మౌలిక సదుపాయాల పనుల్లో రీసైకిల్ చేసిన వ్యర్థాల ఉత్పత్తులను ఉపయోగించడం ఇకపై తప్పనిసరి అని వివరించారు.

ఉల్లంఘులకు జరిమానాలు…

ప్రభుత్వ నిబంధనల ప్రకారం భవన నిర్మాణ వ్యర్థాల సేకరణ, రవాణా ఛార్జీలను ఖరారు చేసినట్లు కమిషనర్ తెలిపారు. అధికారిక ఏజెన్సీ వాహనాల ద్వారా వ్యర్థాలను సేకరించి తరలిస్తే టన్నుకు 426 రూపాయలుగా, ఒకవేళ నిర్మాణ యజమానులే స్వంత వాహనాల్లో ప్లాంట్‌కు తరలిస్తే టన్నుకు 106.50 రూపాయలుగా ధరలను నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించి అధిక లోడ్‌తో రవాణా చేసినా, ఎక్కడపడితే అక్కడ వ్యర్థాలను పారబోసినా కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. మొదటి తప్పిదానికి 25 వేల రూపాయలు, రెండో తప్పిదానికి 50 వేల రూపాయలు, మూడోసారి కూడా అదే తప్పు పునరావృతమైతే లక్ష రూపాయల భారీ జరిమానాతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే భవన నిర్మాణ వ్యర్థాలను అక్రమంగా తరలించేందుకు లేదా నిబంధనలకు విరుద్ధంగా డంపింగ్ చేయించేందుకు బాధ్యులైన నిర్మాణ యాజమాన్యాలు, కాంట్రాక్టర్లు లేదా సంబంధిత సంస్థలపై ప్రతి ఉల్లంఘనకు అదనంగా 50 వేల రూపాయల చొప్పున జరిమానా విధించబడుతుందని తేల్చి చెప్పారు. శంషాబాద్, తూముకుంట పరిధిలోని ప్లాంట్ల కోసం టోల్ ఫ్రీ నంబర్ 18002030033 లేదా వాట్సాప్ నంబర్ 7330000203 ద్వారా, అలాగే జీడిమెట్ల, ఫాతుల్లాగూడ ప్లాంట్ల కోసం టోల్ ఫ్రీ నంబర్ 18001201159 లేదా వాట్సాప్ నంబర్ 9705433369 ద్వారా సంప్రదించి వ్యర్థాలను సురక్షితంగా తరలించాలని కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు.

Next Story