అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి: ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ

by Ajay Maddhiboyina |

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాంఘీక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ గురుకుల కార్యదర్శి కి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ వినతిపత్రం సమర్పించింది.

అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి: ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాంఘీక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ గురుకుల కార్యదర్శి కి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రజినీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అనేక గురుకులాలు ఇప్పటికీ అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తయినా గురుకులాలకు సొంత భవనాలు నిర్మించడంలో నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ విద్యార్థులకు కొత్త యూనిఫాంలు అందించకపోవడంతో గత ఏడాది యూనిఫాంలనే వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, ట్రాక్‌సూట్లు, ట్రాక్ ప్యాంట్లు, క్రీడా దుస్తులు సకాలంలో అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

అమ్మాయిలకు మెడికల్ కిట్లు అందించడంతో పాటు ప్రతి గురుకులంలో అవసరమైన మౌలిక వసతులు, క్రీడా సామగ్రి ఏర్పాటు చేయాలని కోరారు. జోనల్ అధికారులు ప్రతి నెలా గురుకులాలను సందర్శించి విద్యార్థులు, తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకుని పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Next Story