ముఖ్యమంత్రి సారూ.. మా రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది..?

by Batti.Sumithra |

"ముఖ్యమంత్రి సారూ.. మా రోడ్డు మరమ్మత్తులు ఎప్పుడు పూర్తవుతాయి..?" అంటూ నాంపల్లి –దేవరకొండ మార్గంలోని గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

ముఖ్యమంత్రి సారూ.. మా రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది..?
X

దిశ, నాంపల్లి : "ముఖ్యమంత్రి సారూ.. మా రోడ్డు మరమ్మత్తులు ఎప్పుడు పూర్తవుతాయి..?" అంటూ నాంపల్లి –దేవరకొండ మార్గంలోని గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. రెండేళ్ల క్రితం ప్రారంభించిన డబుల్ రోడ్డు పనులు ఇప్పటికీ పూర్తికాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు పై కేవలం కంకర పరచి, ఫార్మేషన్ పనులను మధ్యలోనే నిలిపివేయడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. నాంపల్లి, తిరుమలగిరి, ఉప్పరిగూడెం, చెల్లవానికుంట గేటు, పసునూరు, మెల్లవాయి, పులికుంట్ల, సుంకిశాల, బండతిమ్మాపురం గేటు, ముష్టిపల్లి, రాజ్య తాండా, కొత్తబాయి, ఫకీర్‌పురం గ్రామాల ప్రజలు ప్రతిరోజూ ఈ రహదారి పై ప్రయాణిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రాత్రి వేళల్లో అత్యవసరంగా రోగులను ఆసుపత్రికి తరలించాల్సి వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లలో పలువురు ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కిందపడటంతో గాయపడి ఆసుపత్రుల పాలయ్యారని చెబుతున్నారు. దేవరకొండ నుంచి నాంపల్లికి విధులకు వచ్చే ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులు కూడా ఈ రహదారి పై నిత్యం ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని పేర్కొంటున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ రహదారి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని, ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకుని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. "అభివృద్ధి అంటే కేవలం శంకుస్థాపనలు కాదు.. పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం కూడా అంతే ముఖ్యం" అని గ్రామస్తులు అంటున్నారు.

Next Story