విద్యుత్‌ సరఫరాలో నిర్లక్ష్యం వహించకండి: ఎమ్మెల్యే

by Kodari Anjali |

నిలిచిపోయిన విద్యుత్ లైన్ల మరమ్మత్తులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.

విద్యుత్‌ సరఫరాలో నిర్లక్ష్యం వహించకండి: ఎమ్మెల్యే
X

దిశ, జగిత్యాల టౌన్: నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాను క్రమబద్ధీకరించాలని, ఎక్కడికక్కడ నిలిచిపోయిన విద్యుత్ లైన్ల మరమ్మత్తులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ ప్రగతి భవన్‌లో ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి సరఫరా, ఖరీఫ్ పంట సాగుకు ఇబ్బంది కలగకుండా ఉదయం 3 గంటల వరకే త్రీఫేస్ కరెంటు ను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీ రోడ్డు పనులకు అడ్డంగా ఉన్న కరెంట్ పోల్స్‌ను వెంటనే తొలగించాలని, ఏడాది కాలంగా నిర్లక్ష్యం వహించడంపై అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఆటంకంగా ఉన్న విద్యుత్ లైన్లను మార్చాలని, వర్షాకాలంలో ప్రజలకు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని పేర్కొన్నారు. పొలాల్లో, గ్రామాల్లో వంగిపోయిన, విరిగిపోయిన స్తంభాలను వెంటనే మార్చాలని అధికారులకు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అందేలా చూడాలన్నారు. ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ప్రజలకు ఎలాంటి విద్యుత్ ఇబ్బందులు రాకుండా అధికారులు బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్‌ఈ సుదర్శనం, డీఈ గంగారం, ఏడీఈలు జవహర్ నాయక్, సిందూర్ శర్మ, ఎస్ఏఓ శ్రీనివాస్, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

Next Story