ఇచ్చిన డబ్బులు తిరిగి అడిగితే చేతబడి చేస్తా.. ఎయిర్‌పోర్టులో ఎన్ఆర్ఐ పూజారి అరెస్ట్!

by Prasad Jukanti |

పూజల పేరుతో లక్షలు వసూలు చేసి, తిరిగి అడిగితే చేతబడి చేస్తానని బెదిరించిన ఎన్ఆర్ఐ పూజారిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు.

ఇచ్చిన డబ్బులు తిరిగి అడిగితే చేతబడి చేస్తా.. ఎయిర్‌పోర్టులో ఎన్ఆర్ఐ పూజారి అరెస్ట్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: పూజల పేరుతో భక్తుల నుంచి లక్షల్లో వసూలు చేసి తిరిగి వాటిని ఇవ్వమంటే చేతబడి చేస్తానని బెదిరింపులకు పాల్పడిన పూజారి అరెస్టు అయ్యాడు. అమెరికా నుంచి వస్తుండగా ఇవాళ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ పూజారి రామలచ్చరావును అధికారులు అరెస్టు చేశారు. ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక పరిహారాల పేరుతో భక్తుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసిన రామ లచ్చారావు వాటిని తిరిగి ఇవ్వమంటే చేతబడి చేస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు బాధితుడు పేర్కొన్నారు. ఈ క్రమంలో అమెరికా పారిపోగా తన వద్ద రూ. 20 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డాడంటూ ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పూజారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎల్ఓసీ జారీ చేశారు. అయితే అమెరికా పారిపోయిన రామలచ్చరావు అక్కడ కూడా చీటింగ్ కు తెరలేపాడు. అక్కడ ఓ గుడి యజమాని తనపై కేసులు పెట్టడంతో భయపడి ఇండియాకు తిరిగి వచ్చిన రామలచ్చరావును ఇవాళ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని బాచుపల్లి పోలీసులకు అప్పగించారు. అయితే ఇతడి బాధితుల జాబితాలో మరికొంత మంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇలా పూజల పేరుతో వలపన్నే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Next Story