తెలంగాణ సీఎంవోలో మరో వికెట్ అవుట్.. నిన్న అజిత్ రెడ్డి, నేడు శ్రీనివాస్ రాజు

by Gantepaka Srikanth |

తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో (CMO) భారీ ప్రక్షాళన కొనసాగుతోంది. పరిపాలనా విభాగంలో గడిచిన రెండు రోజులుగా జరుగుతున్న ఊహించని మార్పులు రాష్ట్ర రాజకీయ, బ్యూరోక్రాటిక్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

తెలంగాణ సీఎంవోలో మరో వికెట్ అవుట్.. నిన్న అజిత్ రెడ్డి, నేడు శ్రీనివాస్ రాజు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో (CMO) భారీ ప్రక్షాళన కొనసాగుతోంది. పరిపాలనా విభాగంలో గడిచిన రెండు రోజులుగా జరుగుతున్న ఊహించని మార్పులు రాష్ట్ర రాజకీయ, బ్యూరోక్రాటిక్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సీఎంవోలో కీలక అధికారిగా ఉన్న ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ కె.ఎస్. శ్రీనివాస్ రాజును ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శ్రీనివాస్ రాజును తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TSRERA) చైర్మన్ పోస్టుకు బదిలీ చేస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు సీఎంవోలో అత్యంత కీలకమైన మౌలిక వసతులు, ప్రాజెక్టుల వ్యవహారాలను పర్యవేక్షించిన ఆయనను.. అకస్మాత్తుగా 'రెరా' చైర్మన్‌గా నియమించడం వెనుక బలమైన పరిపాలనా పరమైన కారణాలు ఉన్నట్లు సచివాలయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

నిన్న అజిత్ రెడ్డి.. నేడు శ్రీనివాస్ రాజు

నిన్నటివరకు ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా ఉన్నబి. అజిత్ రెడ్డిని ఆ బాధ్యతల నుంచి తొలగించి, మెట్రో రైల్ అదనపు ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు (FAC) అప్పగించిన సంగతి తెలిసిందే. ఆ వేడి చల్లారక ముందే.. సరిగ్గా మరుసటి రోజే సీఎంవోలో మరో కీలక వికెట్ పడిపోవడం గమనార్హం. శ్రీనివాస్ రాజు వంటి సీనియర్ అధికారిని సీఎం కార్యాలయం నుంచి లూప్ లైన్ లాంటి 'రెరా'కు పంపడం బ్యూరోక్రాటిక్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వరుసగా జరుగుతున్న ఈ బదిలీలు, బాధ్యతల మార్పులను గమనిస్తే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కార్యాలయాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసే పనిలో పడ్డట్లు స్పష్టమవుతోంది. రాబోయే రోజుల్లో సీఎంవోలో మరికొన్ని కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని, ఇదంతా ఒక వ్యూహం ప్రకారమే జరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వరుస పరిణామాలు సచివాలయ వర్గాల్లో పెను సంచలనానికి దారితీశాయి.

Next Story