‘సర్కారుకు పంతాలు పట్టింపులు వద్దు.. ఆ నోటీసులు వెంటనే వెనక్కి తీసుకోవాలి’: హరీష్ రావు

by Jakkula.Mamatha |   (  Updated:2026-02-22 06:44:36  IST  )

మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు సర్కారును డిమాండ్ చేశారు.

‘సర్కారుకు పంతాలు పట్టింపులు వద్దు.. ఆ నోటీసులు వెంటనే వెనక్కి తీసుకోవాలి’: హరీష్ రావు
X

దిశ, గండిపేట: ప్రభుత్వానికి పంతాలు, పట్టింపులు ఎలాంటి భేషజాలు వద్దని.. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు సర్కారును డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడ పరిధిలోని మధు పార్క్ రిడ్జ్ గేటెడ్ కమ్యూనిటీ వాసులకు ఇటీవల సర్కార్ గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం జారీ చేసిన నోటీసులపై ఆయన వారికి భరోసా ఇచ్చేందుకు ఈరోజు వారిని కలిసి అండగా నిలిచారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, దేవి రెడ్డి సుధీర్ రెడ్డి, కార్తీక్ రెడ్డి తో కలిసి ఆయన మధు పార్క్ అపార్ట్మెంట్ వాసులను కలిసి వారితో మాట్లాడి మనో ధైర్యం కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయిందని విమర్శించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో ప్రజల ఇళ్లను స్వాధీనం చేసుకోవడం సరికాదని, వెంటనే నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు పరిహారం కింద ఇచ్చే టిడిఆర్, డబ్బులు అవసరం లేదన్నారు. గాంధీ విగ్రహం ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, కానీ పేద, మధ్య తరగతి ప్రజల ఇల్లు తీసుకొని లక్షల కోట్లు ఖర్చు చేసి విగ్రహం ఏర్పాటు చేయడం సరికాదన్నారు. హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో ఖాళీ జాగా ఉన్నాయని అందులో గాంధీ విగ్రహం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందన్నారు. ఇళ్లను, అపార్ట్మెంట్లను కూల్చివేసి విగ్రహం ఏర్పాటు చేయడం సరికాదన్నారు.

అదానీ, అంబానీ కోసం..

బడా కార్పొరేట్ కంపెనీల కోసం అంబానీ, ఆదానిలకు భూములు కట్ట పెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కారు కుట్ర పన్నుతుందని హరీష్ రావు ధ్వజమెత్తారు. అవసరమైతే హైకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ వరకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని, మధు పార్క్ రిడ్జ్ వాసులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక్కడి ప్రజలకు మాజీ సీఎం కె. చంద్రశేఖర్ రావుతో మంచి అనుబంధం ఉందని, ఇక్కడికి మూడు సార్లు వచ్చారని, ఆయనను తిరిగి అధికారంలోకి తెచ్చుకొని మంచి పాలన సాగిద్దాం అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రజలంతా ఐక్యంగా పోరాటం చేయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. నోటీసులపై ఇక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

20 రూపాయలు పెట్టి వాటర్ ట్యాంకులో విషం కలిపి ఇస్తే తామంతా చనిపోతామని ఓ వృద్ధురాలు కన్నీటి పర్యంతమైందని హరీష్ రావు ధ్వజమెత్తారు. అపార్ట్మెంట్ నుంచి ఐదారు గురు ప్రతినిధులు ఇతలతో కలిసి తమ దగ్గరికి వస్తే కార్యాచరణ ఆలోచిద్దామని హరీష్ రావు సూచించారు. అనంతరం అపార్ట్మెంట్ నివాసితులు కొందరు మాట్లాడారు. అంతకుముందు సబితా ఇంద్రారెడ్డి తదితరులు సర్కారు తీరుపై ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ లతా ప్రేమ గౌడ్, బీఆర్ఎస్ అధ్యక్షుడు రావు కొండల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనుక రియ‌ల్ ఎస్టేట్ వ్యాపార‌మే.. హ‌రీష్ రావు విమ‌ర్శ‌లు

Next Story