తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. భార్యాభర్తల మధ్య తగ్గనున్న గొడవలు, విడాకులు

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-18 03:09:04  IST  )

తెలంగాణ రాష్ట్ర మహిళా క‌మిష‌న్(Telangana Women's Commission), రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సఖీ వన్ స్టాప్ సెంటర్లకు ఇటీవల పెరుగుతున్న వివాహ సంబంధ ఫిర్యాదులు ఒక గంభీరమైన సామాజిక వాస్తవాన్ని సూచిస్తున్నాయి.

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. భార్యాభర్తల మధ్య తగ్గనున్న గొడవలు, విడాకులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర మహిళా క‌మిష‌న్(Telangana Women's Commission), రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సఖీ వన్ స్టాప్ సెంటర్లకు ఇటీవల పెరుగుతున్న వివాహ సంబంధ ఫిర్యాదులు ఒక గంభీరమైన సామాజిక వాస్తవాన్ని సూచిస్తున్నాయి. వివాహ బంధంలో భిన్నాభిప్రాయాలు, పరస్పర అవగాహన లోపం, తల్లిదండ్రుల జోక్యం, న్యాయపోరాటాలు, విడాకులు, పిల్లల మానసిక వేదన వంటి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. పూర్వకాలంలో పెద్దలు, బంధువులు, యువ దంపతులకు వివాహానికి ముందు, తరువాత కూడా మార్గదర్శకత్వం ఇచ్చేవారు. కానీ ఆధునిక జీవనశైలిలో చిన్న‌ కుటుంబాల పెరుగుదల, పట్టణీకరణ, తరాల మధ్య బంధం తగ్గిపోవడం వలన ఈ మార్గదర్శకత పూర్తిగా కనుమరుగైపోయింది. కొన్ని కేసుల్లో తల్లిదండ్రులే వివాహ వివాదాల్లో పక్షాలుగా మారి సమస్యను మరింత క్లిష్టం చేస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో, దంపతులు వివాహ బంధంలో అడుగుపెట్టే ముందు ఆ బంధం యొక్క బాధ్యతలను, భావోద్వేగ గాఢతను, పరస్పర గౌరవాన్ని అర్థం చేసుకునేలా ప్రత్యేక కౌన్సెలింగ్ అవసరమని తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క అన్నారు. దీనికి సమర్థమైన పరిష్కారంగా వివాహ పూర్వ కౌన్సెలింగ్ సెంటర్లు (Pre-Marital Counselling Centres – PMCCs) రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. ఈ నేప‌థ్యంలో వివాహ పూర్వ కౌన్సెలింగ్ సెంటర్ల ఏర్పాటుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ సిద్ధం చేసిన ఫైల్‌పై మంత్రి సీత‌క్క శుక్ర‌వారం నాడు సంత‌కం చేశారు. ఈ కేంద్రాలు వివాహ బంధానికి సిద్ధమవుతున్న యువజంటలకు పరస్పర అవగాహన, వివాద పరిష్కారం, భావోద్వేగ అనుకూలత వంటి అంశాలపై శిక్షణ ఇవ్వడమే కాకుండా, చట్టపరమైన హక్కులు, లింగస్పందన, కుటుంబ బాధ్యతలపై అవగాహన కల్పిస్తాయి. ఈ కౌన్సెలింగ్ వల్ల వివాహం ప్రారంభ దశలోనే తలెత్తే విభేదాలు తగ్గి, గృహహింస, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు నివారించవచ్చని ప్ర‌భుత్వం భావిస్తోంది.

ప్రతి జిల్లాలో ఒక వివాహ పూర్వ కౌన్సెలింగ్ కేంద్రం ఏర్పాటు చేయ‌నున్నారు. ప్రారంభ దశలో ఈ కేంద్రాలను సఖీ లేదా వన్ స్టాప్ సెంటర్లలో ఏర్పాటు చేసి, అవసరమైతే తరువాత సొంత‌ భవనాలు ఏర్పాటు చేస్తారు. ఈ కేంద్రాల్లో శిక్షణ పొందిన సైకాలజిస్టులు, న్యాయ నిపుణులు, సోషల్ వర్కర్లు, మ్యారేజ్ కౌన్సెలర్లు వంటి నిపుణులను నియ‌మిస్తారు. వివాహ పూర్వ కౌన్సెలింగ్ సేవ‌ల‌ను వీరు అందిస్తారు. ఒక్కొక్క‌రికి నెల‌కు రూ.30 వేల వేత‌నం ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. సిబ్బంది జీతాలు, నిర్వాహ‌ణ తదితర అవసరాల కోసం ఏడాదికి రూ. ఐదు కోట్ల వరకు ఖర్చు అవుతున్నట్లు అంచనా వేశారు. సంబంధిత ఫైల్‌పై మంత్రి సీతక్క సంతకం చేయగా, ఆర్థిక శాఖ ఆమోదం తర్వాత ఈ సెంటర్ల ఏర్పాటు ప్రారంభం కానుంది. ఈ కౌన్సెలింగ్ సెంటర్ల ద్వారా యువ దంపతులు తమ సంబంధంలో బాధ్యత, పరస్పర గౌరవం వంటి విలువలను అర్థం చేసుకొని, సుస్థిరమైన కుటుంబ జీవితాన్ని నిర్మించగలరు. ఇది కేవలం వివాహ సమస్యల నివారణకు మాత్రమే కాకుండా, సమాజ నిర్మాణానికి దోహదపడే సంస్కరణాత్మక ప్రయత్నం అవుతుందని మంత్రి సీతక్క అన్నారు.

ఈ కేంద్రాల ఏర్పాటుతో కుటుంబ విభేదాలు, గృహహింస, విడాకులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. యువ దంపతుల భావోద్వేగ, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది సమాజంలో స్థిరమైన, సంతోషకరమైన కుటుంబ వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా తీసుకున్న ఒక ముందడుగు అవుతుంది. ప్రతి వివాహం అవగాహనతో, గౌరవంతో, బాధ్యతతో ప్రారంభమయ్యే సమాజాన్ని నిర్మించాలన్నది తెలంగాణ ప్రభుత్వ సంకల్పం అని మంత్రి సీతక్క తెలిపారు.

Read More..

సర్కార్ మరో కీలక నిర్ణయం.. త్వరలో ప్రీ మారిటల్ కౌన్సెలింగ్ సెంటర్స్

Next Story